లగచర్ల లంగతనం కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందుకు పోయారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో గొడవ చేస్తే హైలెట్ అవుతామని కేటీఆర్.. నరేందర్ రెడ్డిని ఉసిగొల్పాడని ఆరోపించారు. లగచర్లలో రాళ్లు, కర్రలు దొరకవు.. ఫ్రీ ప్లాన్ గా రాళ్లు, కర్రలు తెప్పించుకొని అధికారులపై దాడులు చేశారన్నారు. మీ ప్రభుత్వంలో కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకొని, మా ప్రభుత్వంలో దాడులు చేయిస్తారా.? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణను సుభిక్షంగా ఉంచాలని కష్టపడి పని చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి నిప్పు కణిక.. ఆ నిప్పు కణికను ముట్టుకున్నారు.. మీరు కాలిపోతారన్నారు.
మహబూబబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ.. లగచర్ల ఘటనను బీఆర్ఎస్ అరాచకం గా చూపిస్తున్నారు.. గిరిజనుల భూములు కేవలం 200 ఎకరాలు మాత్రమేనన్నారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఏడుగురికి భూములు లేవు అన్నారు. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం భూసేకరణ జరుపుతోందన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా భూసేకరణ చేయాల్సిందేనన్నారు. భూములు కోల్పోయిన వారికి 4 రేట్లు రెట్టింపుగా పరిహారం చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారన్నారు.