కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగానే పొంగులేటి, జూపల్లిని కలిశాం : రేవంత్
Congress leaders met Jupalli Krishnarao and Ponguleti Srinivas Reddy. బీఆర్ఎస్ బహిష్కృత నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో బుధవారం కాంగ్రెస్ నేతలు
By Medi Samrat Published on 21 Jun 2023 5:09 PM ISTబీఆర్ఎస్ బహిష్కృత నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో బుధవారం కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు భేటీ అయ్యారు. మొదట మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు.. ఆయనను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. హైదరాబాద్‌లోని జూపల్లి నివాసానికి వెళ్లిన రేవంత్, కోమటిరెడ్డిలు ఆయనతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డితో మరికొందరు ముఖ్య నేతలు కూడా జూపల్లి నివాసానికి వెళ్లినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు జూపల్లి నివాసంలో లంచ్ చేశారు. అనంతరం రేవంత్, కోమటిరెడ్డి, జూపల్లిలు మీడియాతో మాట్లాడారు.
రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగితేనే బీఆర్ఎస్‌ను గద్దె దించలగమని అన్నారు. తద్వారా తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఇంకా చాలా మంది పెద్దలు కాంగ్రెస్‌లో చేరతారనే విశ్వాసం ఉందన్నారు. జూపల్లి కృష్ణారావును కలిసి పార్టీలోకి ఆహ్వానించామని చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ అభివృద్ది కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం జూపల్లి పోరాడారని అన్నారు. జూపల్లి కృష్ణారావు, కూచకుళ్ల దామోదర్ రెడ్డిలను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా చెప్పారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని జూపల్లి కృష్ణారావు చెప్పారని తెలిపారు. జూపల్లి చేరితే కాంగ్రెస్ మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు.
జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రేవంత్, కోమటిరెడ్డిలు తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరికపై అడగగా.. ఇంకా సమయం ఉందని జూపల్లి సమాధానమిచ్చారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దని అన్నారు.
అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వెళ్లారు. అక్కడ ఆయనతో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
భేటీ అనంతరం పొంగులేటి నివాసం వద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పరితపించిన జయశంకర్ సార్ వర్దంతి నేడు.. వారి స్పూర్తితో ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిందని అన్నారు. ఆయన సిద్ధాంతాలకు ఆకర్శితులై ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారు. వారి స్పూర్తితో విద్యార్థులు ఉద్యమంలో ప్రాణత్యాగాలతో తెలంగాణ తెచ్చారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ ప్రయోజనం చేకూరలేదని ఆరోపించారు. ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు.
తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని తెలిపారు. కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగానే పొంగులేటిని కలిసామని స్పష్టం చేశారు. రామ్ సాహెబ్ సురేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇక కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని మేమంత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో కీలక నేతల సూచన మేరకు పొంగులేటిని, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్నారు. కేసీఆర్ పతనానికి పొంగులేటి, ఖమ్మం జిల్లా నేతలు పునాది వేస్తారని అన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను పార్టీ పెద్దలకు వివరిస్తామన్నారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభ కేసీఆర్ అధికారానికి చివరి రోజు అవుతుందని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతం మొత్తం కాంగ్రెస్ కు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. హరగోపాల్, విమలక్క, ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని.. విమలక్కపై పెట్టిన ఉపా కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.