ఏఐసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ రాహుల్ గాంధీతో నూతనంగా నియమించబడ్డ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు బుధవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు, కార్యనిర్వాహక అధ్యక్షులు, చైర్మన్ లు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా రాహుల్ గాంధీ అందరితో సమావేశం అయ్యారు. అనంతరం విడివిడిగా మాట్లాడారు.
ప్రధానంగా రాష్ట్రంలో అమలు అవుతున్న దళిత బంధు, నిరుద్యోగ సమస్య, కేసీఆర్ కుటుంబ అక్రమాలు, అవినీతి, పోడు.భూముల అంశాలు, హుజురాబాద్ ఉప ఎన్నికలు, రాష్ట్రంలో దళిత దండోరా సభలు తదితర అంశాలపై చర్చించారు. అలాగే పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాల గురించి చర్చించారు. రాహుల్‌ను కలిసిన వారిలో గీతారెడ్డి, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, దామోదర రాజా నర్సింహ, మహేశ్వర్ రెడ్డి, అజ్మతుల్లా హుసేన్ తదితరులు ఉన్నారు.