ఆరు గ్యారెంటీల కార్డులు అంటూ 'ఫేక్ కార్డు' తో మోసాలు.!

తెలంగాణలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఆరు హామీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రకటించింది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Dec 2023 8:24 PM IST
ఆరు గ్యారెంటీల కార్డులు అంటూ ఫేక్ కార్డు తో మోసాలు.!

హైదరాబాద్: తెలంగాణలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఆరు హామీలను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రకటించింది. చాలా మంది కేటుగాళ్లు తెలంగాణలో నకిలీ ‘ఆరు గ్యారంటీ’ కార్డులను పంపిణీ చేస్తున్నారు, అందుకు బదులుగా ప్రజల నుండి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇలాంటి అనేక నకిలీ కార్డులను ముద్రించి పంపిణీ చేశారు.

ఇటీవల ముగిసిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థుల వద్దకు ప్రజలు ఈ కార్డులతో వస్తున్నారు. అయితే ఇలాంటివి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా జారీ చేయలేదు. కొందరు మోసగాళ్లు ఈ పనికి పాల్పడుతూ ఉండడంతో.. ఇలాంటి నకిలీ హామీ కార్డులను ముద్రించి ప్రజలను తప్పుదోవ పట్టించకుండా అన్ని మీసేవ, ఆన్‌లైన్ సెంటర్లకు ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కి లేఖ రాశారు.


నకిలీ కార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫొటోలు :

రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల సాయంతో ఒక్కో కుటుంబానికి రూ.200 నుంచి రూ.500 తీసుకుని నకిలీ గ్యారెంటీ కార్డులను విక్రయిస్తున్నట్లు న్యూస్‌మీటర్ గుర్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బహదూర్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు రోజుల నుండి ఇటువంటి సంఘటనలు నమోదయ్యాయి.

“నేను ఈ నకిలీ కార్డులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. కార్డులు ఉన్నవారికే ప్రయోజనాలు లభిస్తాయని నమ్మించి ఈ కార్డులకు ప్రజలకు అమ్ముతున్నారు. ప్రజలు కూడా నిజమని నమ్మి డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ అక్రమార్కులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి" అని గోషామహల్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎం సునీత తెలిపారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఫొటోను నకిలీ కార్డుపై ముద్రించారు.

మీసేవా కేంద్రాల వినియోగం

జి.నిరంజన్ మాట్లాడుతూ, “ఇది ప్రభుత్వ కేంద్రాలను దుర్వినియోగం చేయడమే. మీసేవ నిర్వహిస్తున్న వారితో అక్రమార్కులు ప్రజల నుంచి డబ్బులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారు. నమోదిత కేంద్రాలు ఎలాంటి హామీ కార్డులు జారీ చేయడం లేదని అవగాహన కల్పించాలని ఆదేశించాలన్నారు. జారీ చేయబడే ఈ నకిలీ కార్డుల గురించి ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవాలని కేంద్రాల వెలుపల నోటీసులు ఉంచాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న దుర్మార్గపు చర్య. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఫొటోలను ఉద్దేశ్యపూర్వకంగా కార్డులపై వేస్తున్నారు. ప్రజలు ఈ నకిలీ కార్డులతో మోసపోకూడదు, ” అన్నారాయన.

ఇవే నిజమైన కార్డులు కాబోతున్నాయా?

లేదు.. అని స్పష్టం చేశారు నిరంజన్. ‘‘రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులను గుర్తించి తదనుగుణంగా వారికి కార్డులను అందజేయనుంది. పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల ముందు ఆరు హామీల జాబితాతో కూడిన కరపత్రాలను ముద్రించారు. ఇప్పుడు, పథకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత లబ్ధిదారులకు వాటి గురించి తెలుస్తుంది. ఉదాహరణకు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించిన పథకంలో కార్డులు లేవు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వద్ద వారి కార్డులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎలాంటి అదనపు కార్డులు అవసరం లేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు, ప్రజా కార్యక్రమాలపై గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చర్యలివి" అని ఆయన అన్నారు.

Next Story