తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా ఈ విషయమై స్పందిస్తూ.. బీఆర్ఎస్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సోషల్ మీడియా పోస్టులో.. 2007 సంవత్సరంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగింది నాడు తల్లి తెలంగాణ పార్టీ కార్యాచరణలోనన్నారు. బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఎస్ రాములు చిత్రీకరణతో ఏర్పడ్డదని తెలిపారు. అప్పటికి నాటి టిఆర్ఎస్, నేటి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన బహుశా జరగలేదు.
తదనంతరం టిఆర్ఎస్ (బిఆర్ఎస్), వారి ఆఫీస్‌లో ఒక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేశారు. కానీ, వారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలలో ఎన్నడూ నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుగా తెలంగాణ తల్లి రూపానికి ఒక అధికార పూర్వక హోదా, గౌరవం, ప్రభుత్వ నిర్దేశ విధానాలు కల్పించలేదు. బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఆ పార్టీ కొట్లాడితే.. ఆ హక్కు వారికి ఎక్కడున్నది? తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణా ఉద్యమకారులు కూడా కొట్లాడవచ్చు. మన బోనాలు, బతుకమ్మ సంస్కృతి తరతరాలుగా నిలిచే ఉన్నవి, ఉంటవి. అందుకు రాజకీయ పార్టీల ప్రయోజనార్ధ ప్రమేయం ఎన్నడు ఒక ఆవశ్యకత కాదు. పానమెత్తుగా ప్రజలు కాపాడుకుంటూనే బతుకుతారు, బతికించుకుంటారు ఎప్పటికీ.. అంటూ బీఆర్ఎస్‌కు చురకలంటించారు.