రైతుల చేతికి సంకెళ్లు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌

Congress Leader VH Fires On CM KCR. ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన‌ రెండు రోజుల వరి దీక్ష ప్రారంభమైంది.

By Medi Samrat  Published on  27 Nov 2021 7:42 AM
రైతుల చేతికి సంకెళ్లు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన‌ రెండు రోజుల వరి దీక్ష ప్రారంభమైంది. దీక్షలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూర్చున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ వరి దీక్ష కొనసాగనుంది. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, సీతక్క, మహేశ్వర్ రెడ్డి, అన్వేష్ రెడ్డి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. నెల రోజుల నుంచి కల్లాల్లో ఉన్న వరిధాన్యం కొనాలని డిమాండ్ తో ఈ దీక్ష చేప‌ట్టింది కాంగ్రెస్‌. తడిసిన ధాన్యం కూడా కొనాల్సిందే అని కాంగ్రెస్‌ డిమాండ్ చేస్తుంది. మొలకెత్తిన ధాన్యం బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాల‌ని కాంగ్రెస్ కోరుతుంది. కాంగ్రెస్ హయాంలో మొలకెత్తిన, తడిసిన ధాన్యం కూడా కొన్నామ‌ని నేత‌లు అంటున్నారు. 2020లో నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ ఇవ్వలేదని ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. వానాకాలం పంట కల్లాల్లో ఉంటే.. యాసంగి పంట గురించి కేసీఆర్ ఢిల్లీకి పోయాడని విమ‌ర్శించారు. యాసంగి పంట ఏం వేయాలో మోదీ చెప్పాలా అనీ కేసీఆర్‌ను ప్ర‌శ్నించారు. చివరి గింజ కొనే వరకు పోరాటం ఆగదని స్ప‌ష్టం చేశారు. ఎఫ్‌సీఐని పెట్టింది కాంగ్రెస్సేన‌ని వీహెచ్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని మండిప‌డ్డారు. రైతుల చేతికి సంకెళ్లు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే న‌ని విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఊళ్లల్లో వడ్ల కుప్పల దగ్గర ధాన్యం కొనే వరకు రైతులకు అండగా ఉండండని వీహెచ్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు విజ్ఞప్తి చేశారు.


Next Story