ఓపికగా ఉంటున్న సీఎంకి దండం పెట్టాలి
కేటీఆర్ మారకపోతే ఇంకో రకంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్.
By - Medi Samrat |
కేటీఆర్ మారకపోతే ఇంకో రకంగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మారకపోతే ప్రజలు ఇంకా ఛీ కొడతారన్నారు. బీఆర్ఎస్ ఇంత చిల్లరగా ఉన్నా సీఎం ఓపికగా ఉంటున్నారు.. ఇంత ఓపికగా ఉంటున్న సీఎంకి దండం పెట్టాలన్నారు. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి దోచి పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ బందు, కేటీఆర్ బందు, హరీష్ బందు, సంతోష్ బందు, కవిత బందు ఉండేదని ఎద్దేవా చేశారు.
చిల్లర రాజకీయాలు చేయడం కేటీఆర్ మానుకోవాలన్నారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో కేటీఆర్ దిట్ట అన్నారు. నిజాలను అబద్ధాలుగా మార్చడం కేటీఆర్ కి అలవాటు అన్నారు. కేటీఆర్ అబద్ధాలను నిజాలుగా వక్రీకరిస్తున్నారని.. కేటీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. మీడియాకి హెడ్ లైన్స్ కోసమే కేటీఆర్ తాపత్రయం అన్నారు. విమర్శలు వాస్తవాలకు దగ్గరగా ఉండాలన్నారు.
పచ్చి అబద్ధాలను కేటీఆర్ ప్రజలపై రుద్దుతున్నారని.. ప్రధానికి మనుమడు, ఇంకో ప్రధానికి కొడుకు అయిన రాహుల్‌కు సొంత ఇల్లు లేదన్నారు. రాహుల్ కి ఆస్తులు కావాలంటే తెలంగాణ కార్యకర్తలు తలా కొంచెం వేసుకుంటే 1000 కోట్లు అవుతాయని రేవంత్ అన్నాడు.. సీఎం మాటలను కేటీఆర్ వక్రీకరిస్తున్నారన్నారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రభుత్వ పైసలను దుబారా చేసారన్నారు. గవర్నమెంట్ సొమ్ముతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా చేసేందుకు వేరే రాష్ట్రాల వారిని ఫ్లైట్స్ లో రప్పించారన్నారు. కేసీఆర్ ఫోజులు కొట్టేందుకు తెలంగాణ పైసలను పంజాబ్ లో పంచారని ఆరోపించారు.. ఆర్ధిక పరిస్థితిని కేసీఆర్ చిన్నాభిన్నం చేశారన్నారు.