రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రన్నింగ్‌ రేస్‌.. వీడియో వైరల్‌

Congress leader Rahul Gandhi's running race with Revanth Reddy. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంటూ యువ తరానికి స్ఫూర్తినిస్తున్నారు. ఈరోజు రాహుల్‌ యాత్రలో

By అంజి  Published on  30 Oct 2022 5:34 AM GMT
రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రన్నింగ్‌ రేస్‌.. వీడియో వైరల్‌

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంటూ యువ తరానికి స్ఫూర్తినిస్తున్నారు. ఈరోజు రాహుల్‌ యాత్రలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఏఐసీసీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వందలాది మంది పార్టీ మద్దతుదారుల మధ్య రన్నింగ్ రేస్‌లో ఒకరికొకరు పోటీ పడ్డారు. అయితే రన్నింగ్‌ రేస్‌లో రాహుల్‌ మిగతావారికంటే ఒకడుగు ముందుకేశారు. రాహుల్‌ గాంధీ అకస్మాత్తుగా గేర్ మార్చడంతో తెలియకుండానే రాహుల్ గాంధీ భద్రతా సిబ్బంది, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు కూడా రన్నింగ్‌ ప్రారంభించారు.

ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారగా, పార్టీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొనసాగుతోంది. రాహుల్‌ వెంట మనిక్కమ్‌ ఠాగూర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, మధుయాష్కీ, మల్లురవి తదితరులు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొంటూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. శనివారం రాహుల్ గాంధీ గిరిజనులతో సంభాషించారు. వారి సంప్రదాయ శిరస్త్రాణాలను ధరించి వారితో కలిసి నృత్యం చేశారు.

ఇవాళ రాహుల్‌ గాంధీ 22 కి.మీల దూరం పాదయాత్ర చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారానికి ఇది ఐదో రోజు. రాహుల్‌ గాంధీ సాయంత్రం షాద్‌నగర్‌లోని సోలిపూర్ జంక్షన్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. రాహుల్‌ తలపెట్టిన యాత్ర శనివారం 20 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసి, రాత్రికి జడ్చర్ల ఎక్స్ రోడ్ జంక్షన్ వద్ద ఆగింది. ఈ యాత్ర నవంబర్ 7న మహారాష్ట్రలో ప్రవేశించడానికి ముందు రాష్ట్రంలో మొత్తం 375 కి.మీ.ల మేర విస్తరిస్తూ తెలంగాణలోని 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.

నవంబర్ 4న యాత్రకు ఒకరోజు విరామం లభించనుంది. వయనాడ్ ఎంపీ రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో పార్టీ ప్రచారం సందర్భంగా క్రీడా, వ్యాపార, వినోద రంగాలకు చెందిన ప్రముఖులతో సహా మేధావులు, వివిధ సంఘాల నాయకులతో సమావేశమవుతారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రార్థనా మందిరాలు, మసీదులు, దేవాలయాలను కూడా ఆయన సందర్శించి ప్రార్థనలు చేస్తారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తెలిపారు. భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది.

Next Story