ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు

సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో అన్యాయం, వివక్షలను సహించలేకనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మోడీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో అదే వివక్ష కొనసాగిస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు.

By Medi Samrat  Published on  23 July 2024 1:00 PM GMT
ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు

సమైక్య రాష్ట్రంలో అభివృద్ధిలో అన్యాయం, వివక్షలను సహించలేకనే తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుని.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, మోడీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో అదే వివక్ష కొనసాగిస్తున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మధుయాష్కి గౌడ్ స్పందిస్తూ.. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అన్యాయాలపై తెలంగాణ సమాజం పోరాడిందని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దురదృష్టవశాత్తు కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణకు నీళ్లు, నిధులు , ప్రాజెక్టుల కేటాయింపులలో తీరని అన్యాయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి సహాయం చేసి ఆదుకోవాల్సిన కేంద్రం.. తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారని విమర్శించారు. రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే, ప్రజలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ గుండు సున్నేనా ..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి, మిగతా రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం సమంజసం కాదన్నారు.

మరీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల పట్ల బడ్జెట్లో తీవ్ర వివక్ష కనిపించిందన్నారు. దేశమంటే కొన్ని రాష్ట్రాల అభివృద్ధి మాత్రమే కాదని.. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా రూపాయి కూడా కేటాయించకపోవడం విడ్డూరమన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు ఏ మొహం పెట్టుకొని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వ వివక్ష ఎంత ఉందో ప్రజలు ఈ సందర్భంగా గమనించాలని సూచించారు. బీజేపీ ఎంపీలను ప్రజలు నిలదీయాలని సూచించారు. తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, కొత్త రైల్వే లైన్లు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐఆర్ ప్రాజెక్ట్‌ల ఊసే లేదన్నారు.

తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే.. స్వశక్తితోనేనని పేర్కొన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాల అమలుతో తెలంగాణలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తూ, అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తెలంగాణను చూసి మోదీ ప్రభుత్వానికి కంటగింపుగా మారిందని మధుయాష్కి గౌడ్ విమర్శించారు.

Next Story