రైతులు కేసీఆర్ మెడలు కూడా వంచుతారు : మధుయాష్కీ

Congress Leader Madhu Yashki Fires On CM KCR. గాడ్సేని ఆరాధించే నరేంద్రమోదీకి గాంధేయ మార్గంలోనూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన

By Medi Samrat  Published on  19 Nov 2021 8:56 AM GMT
రైతులు కేసీఆర్ మెడలు కూడా వంచుతారు : మధుయాష్కీ

గాడ్సేని ఆరాధించే నరేంద్రమోదీకి గాంధేయ మార్గంలోనూ, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడపాలని తాజాగా తెలిసివచ్చిందని ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రైతులను తొక్కి చంపిన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు జైల్లో ఉన్నా ఆయన ఇంకా మోదీ మంత్రివర్గంలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. అజయ్ మిశ్రాను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మధు యాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి రోజున రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకున్న వార్త రావడం నిజంగా సంతోషంగా ఉందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గాంధేయవాదం, గాంధీ సిద్ధాంతాలను నమ్ముకుని పరిపాలన కొనసాగిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు అలాగే చేస్తుందని ఆయన చెప్పారు. గాంధేయ మార్గంలోనే ప్రభుత్వాన్ని నడపాలని గాడ్సేని ఆరాధించే నరేంద్ర మోదీకి ఇవాళ తెలిసివచ్చిందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడపాలి కానీ.. నిరంకుశంగా పాలన చేయడం సాధ్యం కాదని మోదీకి ఈ రోజు తెలిసివచ్చిందని అన్నారు.

మోదీ తీసుకున్న నోట్ల రద్దు వంటి అవివేక నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ లోకి వచ్చింది. కోవిడ్ ప్రభావాన్ని అంచనావేయడంలో మోదీ విఫలమయ్యారు. అంతేకాక కోవిడ్ బాధితులను, మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలోనూ కేంద్రం పూర్తిగా విపలమైందన్నారు. ఆనాడు కరోనా ప్రభావాన్ని ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంతో ముందుచూపుతో చెప్పారని గుర్తు చేశారు. కానీ మోదీ నిర్లక్ష్యంతోనూ, అహంకారంతోనూ వ్యవహరించారన్నారు. ప్రతిపక్షాలు సూచించే అంశాలను రాజకీయాల కోసం కాకుండా దేశ హితం కొరకు ఆలోచించి ఇప్పటినుంచైనా నిర్ణయాలు చేయాలని మోదీకి హితవు పలికారు.

మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఈ గులాబీ నేత‌లంతా.. గులాములుగా మారి దండాలు పెడుతూ మోదీని ప్రశంసించారు. ఇవాళ మాట్లాడతున్న కేసీఆర్ ఏనాడైనా ఈ రైతు వ్యతిరేక చట్టాలపై శాసనసభలో మాట్లాడారా? ఇది తమ విజయం అని చెప్పుకుంటున్న కేసీఆర్ కు నిజంగా సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకూ కూడా ఐకేపీ సెంటర్లలో లక్షలాది క్వింటాళ్ల ధాన్యం పడివుందన్నారు. రైతులు కొనుగోలు సెంటర్లలోనే చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం వరిధాన్యాన్ని కొనకుండా యాసంగి పంట గురించి కేసీఆర్ వేషాలు వేస్తున్నార‌ని మధు యాష్కీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశప్రధాని మెడలు వంచిన రైతులు కేసీఆర్ మెడలను కూడా వంచుతారన్నారు. ఇప్పటికైనా తెలివితెచ్చుకుని ధాన్యాన్ని వెంటన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

నరేంద్ర మోదీ, ఛోటీ మోదీ అయిన కేసీఆర్ ఇద్దరూ ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతటి నీచాతినీచానికైనా పాల్పడతారన్నారు. రెడీమేడ్ గా తెలంగాణ ఉద్యమంలో జొర్రి ఇవ్వాళ కల్వకుంట్ల కుటుంబం అధికారంలోకి వచ్చింది. అధికార ఆకాంక్ష కొరకు వీళ్లు ఎంతకైనా తెగిస్తారు. మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల తరువాత మోదీకి.. ఇక్కడ కేసీఆర్ కు తెలివి వచ్చినట్లు కనిపిస్తోందన్నారు. మోదీ, కేసీఆర్ లు ఎన్నికల్లో గెలిచేందుకు ఏమైనా చేస్తారని ప్రజలు, రైతాంగం, యావత్ సమాజమంతా గుర్తించాలన్నారు. ప్రకటనలతోనే పంగనామాలు పెట్టే ప్రయత్నాలు మోదీ, కేసీఆర్ లు చేస్తారని తీవ్రస్థాయిలో విమర్శించారు. వీళ్ల దొంగాటలు, మోసాలు ఇంక సాగవు. దోచుకోవడంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దొందూదొందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెలుకవతోనే ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రజల పక్షాన, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు.

తెలంగాణ రైతులు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. దేశంలో అత్యధికంగా వరిపండించే పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, కర్ణాటకలో వరి ధాన్యం సేకరణలో రాని ఇబ్బందులు.. ఒక్క తెలంగాణలో ఎందుకు వస్తున్నాయి. ధాన్యం సేకరణ విషయంలో కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నాడన్నారు. మెసలి కన్నీరు కారుస్తున్న కేసీఆర్ ను రైతులు నమ్మరు. వెనువెంటనే ఐకేపీ సెంటర్లు పెంచి ధాన్యం సేకరించాలి. అకాల వర్షాలతో పండించిన ధాన్యం తడిసిపోయి నష్టపోయే ప్రమాదం ఉంది. వారిని వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధరను వెంటను ప్రకటించాలి. అంతేకాక ప్రైవేటు వ్యక్తులు కొనుగొలు చేస్తే.. మద్దతు ధరకంటే తక్కువకు కొనకూడదన్న ఆదేశాలను ఇవ్వాలన్నారు.


Next Story
Share it