మంత్రి మల్లారెడ్డిని మంత్రివ‌ర్గం నుండి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు లేఖ

Congress Leader Letter To Governor. మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు

By Medi Samrat  Published on  26 Aug 2021 1:49 PM GMT
మంత్రి మల్లారెడ్డిని మంత్రివ‌ర్గం నుండి బర్తరఫ్ చేయాలని గవర్నర్‌కు లేఖ

కార్మిక శాఖ‌ మంత్రి మల్లారెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశారు. మంత్రిగా ఉండి అసభ్యంగా తొడకొట్టి పరుష పదజాలము తో దూషిస్తూ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి పై సవాలు విసిరిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిని గవర్నర్ వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని లేఖ‌లో కోరారు. హుందాగా ఉండాల్సిన మంత్రులే టీఆర్ఎస్‌ పార్టీ ఆఫీస్‌లో వీధి రౌడిల్లా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మాట్లాడటం క‌రెక్టు కాద‌ని అన్నారు.


మల్లారెడ్డి హాస్పిటల్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ భవనాల ప్రాంతాలను చూస్తేనే అవి ఆక్రమించుకున్నవా? కాదా తెలుస్తుందని.. వేరే రుజువులు అక్కర్లేద‌ని అన్నారు. గొప్పగా చెప్పుకునే మల్లారెడ్డి కాలేజీలు ఉన్నవి విద్యాదానానికి కాదని.. కేవ‌లం ధనార్జనకే అని ఫైర‌య్యారు. మ‌ల్లారెడ్డి కాలేజీలలో ఆయన ఏ విధంగా సీట్లు అమ్ముకునేది జగమెరిగిన సత్యమ‌ని అన్నారు. మల్లారెడ్డి స్వయానా తనకు 600 ఎకరాల భూమి ఉన్నదని.. వాటన్నింటినీ డబ్బిచ్చి కొన్నాన‌ని చెప్తున్న నేఫ‌థ్యంలో వాస్తవాలను నిగ్గు తేల్చటానికి, ఈటెల రాజేందర్ భూములపై విచారణ జరపటానికి అధికారుల కమిటీ వేసినట్లు.. ఒక అధికారుల కమిటీని హైకోర్ట్ న్యాయ మూర్తి పర్యవేక్షణలో ఏర్పాటు చేయాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీపై రోజ‌రోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌కు ఆయన మంత్రులకు వణుకు పుడుతున్నదని అన్నారు. అందుకే ఈ ఉలికిపాటు, తొడగొట్టుడు అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయపార్టీకి ఏ ప్రాంతానికైనా వెళ్లి తమ వాణిని వినిపించే హక్కు రాజ్యాంగము ప్రసాదించిందని.. నియంతృత్వంలో, రాచరికంలో లేమని గ్రహించాలని అన్నారు. గజ్వేల్ కు రానీయమనే హక్కు ఎవరికీ లేదని.. అడ్డంకులు సృష్టించే వారిపై డీజీపీ ముందస్తు చర్యలకు ఆదేశించాలని కోరారు. కేసీఆర్‌, కేటీఆర్ల పర్యటనలు ఉంటే కాంగ్రెస్ వారిని అరెస్ట్ చేసే పోలీసులు.. కాంగ్రెస్ నాయకుల పర్యటనలు ఉంటే టీఆర్ఎస్‌ వారిని అరెస్ట్ చేసి తమ నిష్పక్షపాతాన్ని నిరూపించుకోవాలని అన్నారు. ఒక వైపు 7 ఏళ్ళ పరిపాలన పై ప్రజలు పెదవి విరుస్తుంటే.. మరొక వైపు కేటీఆర్‌ 20 ఏళ్ళూ మేమే పరిపాలిస్తామంటుంటే ప్రజలు ముక్కుపై వేలేసుకుంటున్నారని అన్నారు.


Next Story