కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దు కానుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గ్రూపు రాజకీయాలు చేయవద్దని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గాల్లో ఇద్దరు సమాన స్థాయి నాయకులు ఉంటే ఒకరికి ఎమ్మెల్యే టికెట్, మరొకరికి ఎమ్మెల్సీ లేదా జెడ్పీ చైర్మన్ ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. ప్రతి పార్టీలో గ్రూపులు ఉంటాయని.. కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేస్తున్నారని అన్నారు.
తనకు పీసీసీ చీఫ్ పదవి రానందుకు కొన్నిరోజులు బాధపడ్డానని.. కానీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి తాను పని చేస్తున్నానని చెప్పారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా ఉంటానన్నారు. ఏ పదవి అయినా ఒక్కటేనని అన్నారు. బీఆర్‌ఎస్‌లోనూ గ్రూపులున్నాయన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. నల్గొండ బీఆర్‌ఎస్‌లో గుత్తా సుఖేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి కడుపులో కత్తులు పెట్టి పొడుచుకోవడానికి సిద్దంగా ఉన్నారన్నారు. తెలంగాణలో నాలుగు కోట్ల మందికి మేలు జరుగుతుందని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని.. రాష్ట్రంలో పదో తేదీ వచ్చిన కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.