ఉద్రిక్తంగా కాంగ్రెస్ ధర్నా.. అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలి
Congress Chalo Raj Bhavan Protest. పెగాసస్ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసనకు
By Medi Samrat Published on 22 July 2021 6:09 PM ISTపెగాసస్ వ్యవహారంపై ఏఐసీసీ పిలుపుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసనకు దిగారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన ఈ ధర్నా కార్యక్రమం జరిగింది. ధర్నా ముగిసిన తర్వాత ర్యాలీగా రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు నేతలు యత్నించారు. ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, సీతక్కను పోలీసులు అదుపులోకి తీసుకొని అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పోలీసుల తీరుపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామన్నా అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతూ హక్కులకు భంగం కలిగిస్తున్నాయి.సమాచారాన్ని విదేశాల చేతుల్లో పెడుతున్నారు. దేశ భద్రతకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ముప్పు తెస్తున్నారని అన్నారు.
కార్యక్రమంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పెగాసస్ వ్యవహారంలో మోదీ, కేసీఆర్ తోడు దొంగలని.. ఛలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతం అయ్యిందని అన్నారు. ముట్టడి విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్ భవన్ ముట్టడిని కేసీఆర్ ప్రభుత్వం లాఠీఛార్జీలతో అణగదొక్కే ప్రయత్నం చేసిందని.. రాజ్ భవన్ ముట్టడి సందర్భంగా పోలీసులు వ్యవహరించినా తీరు తీవ్ర ఆక్షేపనీయమని అన్నారు. అరెస్టు చేసిన మా నాయకులను, కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మోదీ, కేసీఆర్ ఒకే గూటి పక్షులని.. ఈ ఘటనతో మరోసారి రుజువైందని.. కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్‌లో ఆరితేరిపోయారని అన్నారు. పెగాసస్ స్పైవేర్ నిఘాపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో న్యాయ విచారణ జరిపించాలని.. న్యాయ విచారణ పూర్తి అయ్యేవరకు హోం మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పెగాసస్ వ్యవహారంలో ప్రధాని కార్యాలయం పాత్రపై విచారణ చేయాలని.. ఈ వ్యవహారంలో దోషులు బయట పడేవరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.