కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించి పలు డిజైన్లను కూడా పరిశీలించారు.