జాతీయ రహదారులకు భూసేకరణకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు. రైతులకు ఎంత పరిహారం వస్తుందో అంత ఎక్కువ వచ్చేలా చేయాలన్నారు. ముఖ్యంగా భూములు తీసుకునే విషయం మానవీయతతో వ్యవహరించాలని సూచించారు. జాతీయ రహదారులకు భూసేకరణ విషయంలో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందో చెప్పాలని అధికారులను కోరారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తకువగా ఉండటం, మార్కెట్ ధరలు ఎకువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కలెక్టర్లే స్వయంగా రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని సీఎం సూచించారు.