తండాలు, గూడాలకు సీఎం రేవంత్ శుభవార్త

తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు.

By -  Knakam Karthik
Published on : 15 Feb 2026 9:05 PM IST

Telangana, CM Revanthreddy, Banjaras, Thandas and Gudala, Congress Government

తండాలు, గూడాలకు సీఎం రేవంత్ శుభవార్త

హైదరాబాద్: తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలని, అందుకోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని చెప్పారు. ప్రతి తండాలో పాఠశాల భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. తాగడానికి మంచినీరు, కరెంట్ అందించాలి. అటవీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నాం..అని రేవంత్ చెప్పారు.

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బంజారా భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని అన్నారు.

ఆదివాసీలకు ఆదిలాబాద్‌లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క - సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదని పేర్కొన్నారు. అందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించినందున, అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story