రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఆ పథకం

తెలంగాణలో రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

By Knakam Karthik
Published on : 20 March 2025 10:39 AM IST

Telangana, Cm Revanthreddy, Fine Rice Scheme, Ration Card Holders

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఆ పథకం

తెలంగాణలో రేషన్ కార్డు వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పేదలకు రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కాగా రేషన్ కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు.

అయితే వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తోంది. ఇలా వచ్చిన వడ్లను రైస్ మిల్లుల్లో మరాడించగా 8 లక్షల టన్నుల సన్నబియ్యం వచ్చినట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాల సమాచారం. ఇవి జిల్లాల్లోని గోదాముల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు.. తర్వాత రేషన్ దుకాణాలకు బియ్యం చేరనున్నాయి. మిల్లుల్లో మరాడిస్తున్న వడ్లతో వచ్చే సన్నబియ్యం మరో 4 నెలలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 91,19,268 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్దిదారులు 2,82,77,859 ఉన్నారని పౌరసరఫరాల శాఖ తెలిపింది.

Next Story