గూగుల్ వినూత్న సంస్థ, మాది వినూత్న ప్రభుత్వం: సీఎం రేవంత్

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik
Published on : 18 Jun 2025 2:30 PM IST

Hyderabad News, Cm Revanthreddy, Congress Government, Google, GSEC

గూగుల్ వినూత్న సంస్థ, మాది వినూత్న ప్రభుత్వం: సీఎం రేవంత్

ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC)ను ప్రారంభించడం సంతోషంగా ఉంది..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇది ప్రపంచంలో ఐదవది మాత్రమే. గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయింది. నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతాం. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్-సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను. ఇది నైపుణ్య అభివృద్ధి పై దృష్టి పెడుతుంది. ఉపాధిని సృష్టించడంతో పాటు దేశం సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుంది. చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం ..ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నా. గూగుల్ లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నా...అని సీఎం వ్యాఖ్యానించారు.

ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి. అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందని నాకు కచ్చితంగా తెలుసు. మీకు సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాం. 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం..అని సీఎం మాట్లాడారు.

మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నాం. గూగుల్ ఆఫీస్ పక్క ని రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశాం. మేము మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం. మేము మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. వీటన్నిటికీ, నాకు మీ మద్దతు అవసరం. తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నా. గూగుల్ , హైదరాబాద్ పాత స్నేహితులు. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నాం. గూగుల్ ఒక వినూత్న సంస్థ, మాది ఒక వినూత్న ప్రభుత్వం...అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Next Story