సీఎంలలో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ మాత్రం ఇదే: సీఎం రేవంత్

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ అంటే అందరికీ తానే గుర్తొస్తానని అన్నారు. ఇదే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

By Knakam Karthik
Published on : 10 April 2025 1:40 PM IST

Telangana, Cm Revanthreddy, Congress Government, Young India Police Schools

సీఎంలలో ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ మాత్రం ఇదే: సీఎం రేవంత్

దేశ చరిత్రలో ఎంతో మంది ప్రధానులు, ముఖ్యమంత్రులు అయ్యారు.. కానీ అందులో కొద్ది మంది మాత్రమే చరిత్రలో గుర్తుండిపోయారు..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో నిర్మించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన ప్రతీ ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉందని.. తన బ్రాండ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిలో బియ్యం రెండు రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది, ఐటీని అధివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌ది.. అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ అంటే అందరికీ తానే గుర్తొస్తానని అన్నారు. ఇదే నా బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అందుకే ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ అనేది మా బ్రాండ్. నిరుద్యోగ యువతకు సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. దేశంలోనే ది బెస్ట్ వర్సిటీగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీని ఏర్పాటు చేసుకోబోతున్నాం..అని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఏటా లక్షలాది మంది బీటెక్ పూర్తి చేస్తున్నారు.. విద్యార్థుల్లో నాణ్యత ఎంతంటే ఎవరి దగ్గరా సమాధానం లేదని అన్నారు. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు కనీసం అప్లికేషన్లు కూడా నింపలేకపోతున్నారని ఆవేదన చెందారు. విద్యార్థుల్లో స్కిల్స్ పెంచేందుకే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ తీసుకొస్తున్నామని అన్నారు. సైనిక్ స్కూల్స్ తరహాలో ఈ స్కూల్స్ నిర్మిస్తామని ప్రకటించారు. దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పోలీస్ స్కూల్ అంటేనే ఓ బ్రాండ్‌గా తయారు కావాలి. త్వరలో ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రీ స్కూల్ విధానం ప్రారంభిస్తామని అన్నారు. ఇందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పోలీస్ స్కూల్స్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడం మనందరి బాధ్యత. సామాజిక బాధ్యతగా ప్రైవేట్ కంపెనీలు పోలీస్ స్కూల్‌కు ఆర్థికసాయం అందించాలి. పోలీస్ స్కూల్ కోసం రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకు అవసరమైన అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..అని సీఎం పేర్కొన్నారు.

Next Story