గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రేపే సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీ

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొస్తుంది.

By Knakam Karthik
Published on : 18 May 2025 8:32 PM IST

Telangana, Cm Revanthreddy, Congress Government, Soura Giri Jala Vikasam Scheme

గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రేపే సబ్సిడీపై సోలార్ పంపు సెట్ల పంపిణీ

తెలంగాణలో పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని ప్రారంభిస్తారు. పథకాన్ని ప్రారంభించిన తర్వాత లబ్ధిదారులకు సోలార్ పంపుసెట్లను పంపిణీ చేస్తారు. అనంతరం సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభకు హాజరవుతారు.

కాగా రూ.12,600 కోట్ల బడ్జెట్‌తో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్న అన్నదాతలందరికీ రానున్న ఐదు సంవత్సరాల్లో సోలార్‌ పంపుసెట్ల ద్వారా నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.12,600 కోట్లు ఖర్చు చేయనుంది. మొదటగా రూ.600 కోట్లు. అనంతరం ఒక్కో సంవత్సరానికి రూ.3,000 కోట్ల చొప్పున ఖర్చు చేయనుంది.

అయితే మండలాల వారీగా ఈనెల 25 వరకు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తించాలి. జూన్‌ 10 వరకు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, భూగర్భ జలాల సర్వే, ఇతర అంచనాలు రూపొందించాలి. జిల్లాస్థాయిలో ఈ నెల 30 నాటికి సర్వే, ఇతర పనులకు టెండర్లు పిలుస్తారు. అనంతరం ఖరారు చేస్తారు. జూన్‌ 25 నాటికి ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇన్‌ఛార్జి మంత్రి అనుమతితో పనులు అప్పగించాలి. జూన్‌ 26 నుంచి 2026 మార్చి 31 వరకు భూముల అభివృద్ధి, బోరుబావుల తవ్వకం, సోలార్‌ పంపుసెట్లను అధికారులు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఉద్యాన పంటల అభివృద్ధి పనులు చేస్తారు. వాటి యూనిట్ల వినియోగపత్రాలను ప్రభుత్వానికి సమర్పిస్తారు.

Next Story