గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సికింద్రాబాద్లోని మహా బుద్ధ విహార సందర్శన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాజ్యం, అధికారం ఉండి వాటిని కాదని 29 ఏళ్ల వయసులో శాంతి కోసం బుద్ధుడు ఆలోచించారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉందని పేర్కొన్నారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉంది.. ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందానన్నారు. ఏ పని అయినా నేను ఎంతో ధ్యానంగా చేస్తానన్నారు.
ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని.. ఒక పాఠశాలను నిర్వహించాలని కోరారు. సమాజంలో అసహనం, అసూయ పెరిగిపోతున్నాయన్నారు. సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉందన్నారు. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం అన్నారు. బుద్దుని సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరికి చేరవేయడానికి అవసరమైన సహాయం వ్యక్తిగా, ప్రభుత్వంగా చేస్తామన్నారు. ఈ ప్రభుత్వం మీది.. అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయన్నారు. తెలంగాణలో బౌద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందన్నారు.