'భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది'.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెరమీదే కాకుండా తెరవెనుక జరిగిన ఘటనల చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
By అంజి Published on 25 Dec 2024 9:03 AM IST'భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది'.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం నుంచి మొదలు తెలంగాణ ఆవిర్భావం వరకు తెరమీదే కాకుండా తెరవెనుక జరిగిన ఘటనల చరిత్రను పుస్తక రూపంలోకి తీసుకురావలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం తెరవెనుక జరిగిన అనేక ప్రయత్నాలు, అందుకు కృషి చేసిన ఎంతో మంది చరిత్ర, వారితో పాటు జరిగిన పరిణామ క్రమాలన్నింటినీ క్రోడీకరిస్తూ పుస్తకం తీసుకొస్తే భావితరాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డి రాసిన వ్యాసాలు, ప్రసంగాల సంకలనం “Nuts, Bolts of War & Peace” పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ #AIPSO రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుస్తకావిష్కరణ అనంతరం సీఎం మాట్లాడారు. ''ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం, 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జనసభ, 2000 లో చిన్నారెడ్డి గారు, 2001 చంద్రశేఖర్ రావు గారు, 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించిన సందర్భం, జేఎసీ ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వంటి ఘటనలపైన సమగ్రంగా విశ్లేషణాత్మకమైన ఒక పుస్తకం రావలసిన అవసరం ఉంది'' అని సీఎం అన్నారు.
తద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమంలో జరిగిన కీలకమైన పరిణామాలు, తెర ముందు కనిపించనివి చాలా మందికి తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిపై యాదవరెడ్డి పుస్తకం రాయాలి. పార్లమెంట్ ముందుకు తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు తలెత్తిన గందరగోళ పరిస్థితులు బిల్లు పాసవుతుందా అన్న ఉద్రిక్తమైన వాతావరణంలో జైపాల్ రెడ్డి అత్యంత కీలకపాత్ర పోషించి బిల్లును ఆమోదముద్ర పడేలా చూశారు. జైపాల్ రెడ్డి, యాదవరెడ్డి ఏ సిద్ధాంతాన్ని చెప్పారో అదే సిద్ధాంతాన్ని చిత్తశుద్ధితో పాటించారు. వారు పదవుల కోసం ఏనాడూ ప్రయత్నించలేదని సీఎం రేవంత్ అన్నారు.
''దేశంలో శాంతి నెలకొన్నప్పుడే అభివృద్ధికి ఆస్కారం ఉంటుంది. శాంతిని కోరుకునే ఇలాంటి వేదికలు ప్రజల్లో దేశం ఎదుర్కొంటున్న పలు విషయాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. భారతదేశం యుద్ధాన్ని ఎదుర్కోవడం లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటే. చైనా 2 వేల చదరపు కిలోమీటర్లకు పైగా మన భూభాగాన్ని ఆక్రమించిన విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. తెలుసుకోవలసిన అవసరం ఉంది. మణిపూర్ లో జరుగుతున్న మారణకాండ రెండు గిరిజన జాతుల మధ్య వైరుధ్యం అన్నట్టు ఉంది. కానీ ఆ వైరుధ్యం వెనుక అక్కడి ఖనిజ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు అక్కడ అంతర్యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆయుధాలను స్వాధీనం చేసుకుని అక్కడ శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉంది'' అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.