దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ...

By -  అంజి
Published on : 10 Dec 2025 6:59 AM IST

CM Revanth Reddy, Telangana Rising 2047 vision document,domestic and foreign representatives, Telangana, Hyderabad

దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ప్రజలకు అంకితమిచ్చారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ సుమన్ బెరీ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్, ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యం, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి పాల్గొని ప్రసంగించారు.

అడోబ్ చైర్మన్, సీఈవో శంతన్ నారాయణ, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ రాజన్, ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకులు ప్రేమ్ వాట్సా సదస్సును ఉద్దేశించి విర్చువల్‌గా మాట్లాడారు.

ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో రాష్ట్రాన్ని నిలపాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతతో ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా వారు అభినందించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు.

“ఈ దార్శనిక పత్రం రూపకల్పన కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 4 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ సూచనలు అందించారు. ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉంది. జల్, జమీన్, జంగల్ కోసం కొమురం భీమ్ ఆనాడు పోరాటం చేయగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.

అలాంటి ఉద్యమాల స్ఫూర్తితో తెలంగాణ ఆకాంక్ష నెరవేరినప్పటికీ ఆశించినంత స్థాయిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగలేదు. అందుకే 4 కోట్ల ప్రజలకు సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం. వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహించే 2047 నాటికి బలమైన ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలని ప్రధానమంత్రి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా అవతరించాలని విజన్‌ను రూపొందించాం.

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ నాలుగు గోడల మధ్య తయారు చేసిన కాగితం కాదు. మేధావులు, ఆర్థిక నిపుణులనే కాకుండా మహిళలు, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసిన ఈ డాక్యుమెంట్‌ను ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నాం. పరిపాలనా పరమైన నిర్ణయం తీసుకునే ముందు పేదలకు నిత్సహాయులకు ఏ విధంగా సహాయ పడగలవో ఆలోచించి ప్రణాళికలు వేసుకోవాలని.. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రి కావడానికి ముందు వారికి మహాత్మగాంధీ సూచించారు.

అదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా విద్య, నీటి పారుదల రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలోనే తెలంగాణ ఒక రోల్ మాడల్‌గా నిలబెట్టాలి. ఈరోజుల్లో పేదరికం కొందరికి ఎక్స్‌కర్షన్‌గా మారింది. చిన్నతనంలో అంటరానితనం, పేదరికాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడిని. వాటిని సమూలంగా రూపుమాపాలని అనుకుంటున్నా.

అత్యంత నిరుపేదలకు అభ్యున్నతి లక్ష్యంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ విధాన పత్రం రూపొందించాం. ఒకవైపు వివక్ష రూపుమాపాలని చెబుతూ, కులాల వారిగా వేర్వేరు పాఠశాలలు నిర్మించాం. మన విద్యా విధానంలో నాణ్యత, నైపుణ్యత లేదు. అందుకనే వాటి స్థానంలో అందరికీ ఒకే చోట విద్యను అందించాలన్న లక్ష్యంతో 20 వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. దేశంలో 140 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ విశ్వక్రీడల్లో ఒక్ బంగారు పతకం సాధించలేకపోతున్నాం.

ఇలాంటి అనుభవాల నేపథ్యంలోనే తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. యువతలో నైపుణ్యత కొరవడుతోందని రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా చూడాలి. మన పిల్లలు భవిష్యత్తులో దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నది మా ఆకాంక్ష. ఎంతో ఉదాత్తమైన లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను నెరవేర్చడంలో మీరంతా మద్దతుగా నిలవండి..” అని ముగించారు.

Next Story