హైదరాబాద్: ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలన్న సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుందని సీఎంవో తెలిపింది. నేడు (14 వ తేదీ) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుంది.
తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొత్త రేషన్ కార్డుల ద్వారా 11.30 లక్షల మందికి లబ్ది చేకూరనుంది. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుతుంది. మొత్తంగా 94,72,422 లక్షలను అందుకుంటుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ ఇచ్చి తీరుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా గడిచిన ఆరు నెలల కాలంలోనే 41 లక్షల మందికి కొత్తగా రేషన్ అందుతోందన్నారు.