2034 వరకు ఈ పాలమూరు బిడ్డే ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
By Medi Samrat
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజలు కేసీఆర్‌ను అక్కున చేర్చుకొని ఎంపీగా గెలిపిస్తే, ఆయన ఈ ప్రాంతానికి ద్రోహం చేశారన్నారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని అన్నారు. తెలంగాణలో ఈరోజు అందరూ బాగుపడుతుంటే ఇక మమ్మల్ని ఎవరు అడుగుతారని కేసీఆర్ దుఃఖపడుతున్నాడన్నారు. కేసీఆర్ దుఃఖం పదేళ్ల వరకు అలాగే ఉంటుంది. ఆ దుఃఖం పెరిగి పెద్దదై భూతమై కబలిస్తుంది తప్ప నీకు విముక్తి లేదు కేసీఆర్ అంటూ తీవ్రంగా విమర్శించారు. నీ కళ్ల ముందే తెలంగాణ అభిృవృద్ధి చెందుతుంది. ఆ బాధ్యత మేం తీసుకుంటానని రేవంత్ రెడ్డి అన్నారు. మరో పదేళ్లు ఈ పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రజలను ఉద్దేశించి చెప్పారు.
పదేళ్ల హయాంలో పాలమూరు ప్రాంతానికి ఏమీ చేయకుండా, ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే దుఃఖం వస్తోందని కేసీఆర్ అనడం విడ్డూరమని అన్నారు రేవంత్ రెడ్డి. పాలమూరు అంటే కేసీఆర్‌కు చిన్నచూపు అని, అయినప్పటికీ ఆయనకు మద్దతిస్తున్న ఈ జిల్లా నేతలు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలకు సిగ్గుండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని నిలదీశారు. 1994 నుంచి పదేళ్లు తెలుగుదేశం అధికారంలో ఉందని, 2004 నుంచి పదేళ్లు కాంగ్రెస్, 2014 నుంచి 2023 డిసెంబరు వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. 2034 వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు.