గాంధీ పరివార్, గాడ్సే పరివార్ మధ్య యుద్ధం జరుగుతుంది.. మనం ఆయనతో కలిసి..
రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం పోరాటం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 27 Jan 2025 4:13 PM ISTరాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి మనం పోరాటం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎన్నికల ర్యాలీ కాదు.. ఇది ఒక యుద్ధం అని పేర్కొన్నారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందన్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారని పేర్కొన్నారు.
గజనీ మహమ్మద్ హిందుస్తాన్‌ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు.. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రయత్నిస్తున్నారని.. కానీ ఆయన ప్రయత్నం ఫలించడం లేదన్నారు. ఎందుకంటే ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారు.. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని పిలుపునిచ్చారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు.. ఇది రెండు పరివార్‌ల మధ్య జరుగుతున్నయుద్ధం.. ఒకటి గాంధీ పరివార్.. మరొకటి గాడ్సే పరివార్.. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ.. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారు.. అందుకే మనమంతా గాంధీ పరివార్‌గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి.. రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నారు.