కాస్త ఆలస్యం కావచ్చు.. కానీ తప్పక న్యాయం చేస్తాం
ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
By Medi Samrat Published on 14 Dec 2024 11:09 AM GMTఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదు.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించాం.. తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయినదని.. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉందన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసాం.. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించాం.. మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు.
సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతను నియమించుకున్నాం. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించాం. IIT వీసీగా, విద్యా కమిషన్ మెంబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామని తెలిపారు. పగిడి పాటి దేవయ్యని స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించుకున్నాం.. అడగకముందే మాదిగ సామాజిక వర్గానికి అందరికంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రభుత్వం మీకు అన్యాయం జరగనివ్వదు.. న్యాయం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. అమలుచేయడంలో కొంత ఆలస్యం కావచ్చు.. కానీ మీకు తప్పక న్యాయం చేస్తామన్నారు. నా రాజకీయ ప్రస్థానంలో మాదిగ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉంది.. ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం చేసే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు.