గల్లీలో కాదు.. ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చాం
విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat
విద్య, ఉద్యోగాలలో, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని… మా ప్రభుత్వం శాసనసభలో రెండు బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో “కాంగ్రెస్ పోరుబాట”కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 2018లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీనవర్గాల మీద కక్షగట్టి రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఉండేలా తెలంగాణ రాష్ట్రంలోచట్టం తెచ్చారు.. ఈనాడు మనం 50 శాతానికి పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే.. ఆనాడు కేసీఆర్ చేసిన చట్టం ఇప్పుడు గుదిబండగా మారిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మా మంత్రివర్గం ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ కు పంపించామని.. రెండు బిల్లులను, ఆర్డినెన్స్ ను గవర్నర్ రాష్ట్రపతికి పంపించారు.. రెండు బిల్లులు పంపించి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి ఆమోదముద్ర పడలేదన్నారు. మోదీ, బీజేపీ ఈ బిల్లులను అడ్డుకుని బలహీనవర్గాలకు అన్యాయం చేస్తుంటే.. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని ఇక్కడికి వచ్చామన్నారు. మోదీ మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికే ఈ ధర్నా అన్నారు. హైదరాబాద్ లో ధర్నా చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నాయకుల మద్దతు ఉంటుంది.. జంతర్ మంతర్ వేదికగా నిర్వహిస్తున్న ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి చెందిన నాయకులంతా మద్దతుగా నిలిచారు.. వంద మంది పైగా పార్లమెంటు సభ్యులు, వేలాదిగా తరలివచ్చిన మిమ్మల్ని చూశాక సంపూర్ణ విశ్వాసం కలిగిందన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన నిర్వహించాం.. వందేళ్లలో 300కు పైగా ముఖ్యమంత్రులు చేయలేనిది.. మీ అందరి సహకారంతో తెలంగాణలో చేయగలిగాం.. ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఈ అవకాశం దక్కింది. ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
మన పోటీ, సవాల్ రిజర్వేషన్లకు అడ్డుపడ్డ కేసీఆరో, బండి సంజయో, కిషన్ రెడ్డినో, రాంచందర్ రావుతోనో కాదు.. మన సవాల్ ఢిల్లీ మీద.. నరేంద్ర మోదీ మీద.. భారత ప్రభుత్వంపై అన్నారు. మోదీగారు… ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాల్ విసురుతున్న.. మా డిమాండ్ ను ఆమోదిస్తారా.. లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోటపై మూడు రంగుల జెండా ఎగరేస్తామని సవాల్ విసిరారు.
మా నాయకుడు రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేసి.. 42 శాతం ఓబీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామన్నారు. ఈ వేదిక నుంచి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా.. అయ్యా నరేంద్ర మోదీ గారు.. మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేం అడగలేదు… మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీరు అడగలేదు.. మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డపై మా బలహీన వర్గాల సోదరులకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామని అడిగితే … మీ గుజరాత్ కు వచ్చిన కడుపుమంట ఏంటి? మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన మోదీకి లేదు.. ఆయన ఆలోచన ఎలా ఉన్నా…ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, రాంచందర్ రావు, బండి సంజయ్ కు ఏమైంది? మీరు మళ్లీ తెలంగాణకు రారా.. మా బలహీన వర్గాల ఓట్లు అడగరా..? తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిందా.. మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెంచుకున్న టీఆర్ఎస్ పేగు బంధం కూడా తెంచుకుందా.. మీరెందుకు మోదీతో అంటకాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదని బీఆర్ఎస్ ని అడుగుతున్నా.. బీజేపీ వాళ్లు మోదీ మోచేతి నీళ్లు తాగుతుండొచ్చు.. కానీ బీఆర్ఎస్ వాళ్ళు మోదీ చెప్పులు మోసి బతుకుతున్నారా? అని ప్రశ్నించారు.
ఎన్నికల కమిషన్ కలవడానికి ఢిల్లీ వచ్చానని ఓ సన్నాసి నిన్న మాట్లాడిండు.. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ లో డ్రామా చేస్తుండని అంటుండు.. మన దీక్ష వాళ్లకు డ్రామాలా కనిపిస్తుంది.. ఆయన పేరు డ్రామారావు.. డ్రామా నీ ఇంట్లో ఉంది.. నీ ఒంట్లో ఉంది.. నీ రక్తంలో ఉంది.. నీ పేరులో ఉంది.. మీ మొత్తం కుటుంబమే డ్రామాలు వేసి బతికే కుటుంబం.. మాకు డ్రామాలు అవసరం లేదు.. మాకు చిత్తశుద్ధి ఉంది.. అందుకే కులగణన నిర్వహించాం.. వందేళ్ల సమస్యకు ఒక్క ఏడాదిలోనే పరిష్కారం చూపించాం.. నువ్వా మా చిత్తశుద్ధిని శంకించేది.. మీ ఇంట్లోనే ఒకరు బీసీకి అనుకూలమంటే.. ఒకరు వ్యతిరేకమంటున్నారు.. అటు ఇటు కాని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నరు అని ఫైర్ అయ్యారు.