సర్వేల ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది : సీఎం రేవంత్
కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 26 March 2024 9:45 AM GMTకాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నామన్నారు. క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోందన్నారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది. అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు మన వంద రోజుల పరిపాలనకు రెఫరెండం అన్నారు. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదామన్నారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఏం చేశారు? అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదు.. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ కు తీసుకెళ్లిన మోదీ.. వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదన్నారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసుకున్న మోదీ.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది? అని ప్రశ్నించారు. ఏం చూసి మూడోసారి మోదీకి ఓటు వేయాలని బీజేపీ అడుగుతుంది? బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని ఎద్దేవా చేశారు.
మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారన్నారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారంటీలను ప్రకటించుకున్నామన్నారు. మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7న జాతీయస్థాయి గ్యారేంటీలను ప్రకటించుకోబోతున్నామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామన్నారు. ఈ జన జాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు.