కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
By Medi Samrat Published on 30 Oct 2024 3:28 PM ISTతెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడుతుందని సామాజిక, ఆర్ధిక రాజకీయ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గాంధీ భవన్ లో కుల గణనపై అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ కూడా తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, అడ్డంకులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడంలో సోనియమ్మ సఫలీకృతం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చిన మాట నెరవేర్చారు. గాంధీ కుటుంబం ఒక మాట ఇస్తే హరిహరాదులు అడ్డు వచ్చినా అది నెరవేర్చి తీరుతుందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టడం ఇక్కడున్న ప్రతీ ఒక్కరి బాధ్యత.. రేవంత్ రెడ్డి రెడ్డినా, మహేష్ గౌడ్ గౌడా అనేది కాదు.. మనం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం అన్నారు.
రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు.. కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చిందన్నారు. మీరంతా కష్టపడితేనే నాకు ఈ బాధ్యత వచ్చింది.. గాంధీ కుటుంబం మాట ఇచ్చిందంటే మరో చర్చకు తావు లేదు.. చర్చకు అవకాశం ఇచ్చారంటే వారు పార్టీ ద్రోహులేనన్నారు. పార్టీ ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం.. పార్టీ విధానాన్ని అమలు చేయడమే మన ప్రభుత్వ విధానం.. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉన్న నిరంజన్ ని బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించుకున్నామని తెలిపారు.
పని చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా.. ప్రతీ క్షణం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ క్యాడర్, లీడర్స్ పై ఉందన్నారు. కుల గణనపై సమన్వయం చేసుకునేందుకు 33 జిల్లాలకు 33 మంది అబ్జర్వర్స్ ను నియమించాలని సూచించారు. బాధ్యతగా పని చేయండి.. మీ కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అమలు చేసే క్రమంలో ఎవరు అభ్యంతరకరంగా వ్యవహరించినా వారిని పార్టీ క్షమించదన్నారు. దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాలి.. ఆ దిశగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు.
తెలంగాణ మోడల్ దేశంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేలా ఉంటుంది.. నవంబర్ 31లోగా కులగణన పూర్తి చేసి భవిష్యత్ యుద్ధానికి సిద్ధం కావాలన్నారు. తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు. కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ లాంటిదన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని సామాజిక న్యాయం ప్రకారం పంచడమే కాంగ్రెస్ విధానం అన్నారు.
భవిష్యత్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో మన మోడల్ ను పరిగణనలోకి తీసుకునేలా మోడల్ డాక్యుమెంట్ ను కేంద్రానికి పంపుతామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.. రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా 10నెలల్లో 50వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.. గ్రూప్-1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్ఠించి అడ్డుకోవాలని చూశాయి.. జీవో ఇచ్చినపుడు, నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినపుడు కోర్టుకు పోలేదు.. కానీ మెయిన్స్ నిర్వహించే సందర్భంలో జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు.. సుప్రీంకోర్టు కూడా వారి పిటిషన్ ను కొట్టేసింది.. కొంతమంది అగ్రవర్ణాల కోసమే గ్రూప్ 1 నిర్వహిస్తున్నారని, బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఒక వాదన తీసుకొచ్చారన్నారు. సెలక్ట్ అయిన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారు.. స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారని వివరించారు.
పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే పార్టీ సహించదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప.. వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడని స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతీ ఒక్కరు తిప్పికొట్టాలని శ్రేణులకు సూచించారు.