మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం.. ఇంకా చేయాల్సింది చాలా ఉంది
భారత్ సమ్మిట్ లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Medi Samrat
భారత్ సమ్మిట్ లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు ఎంతో గొప్ప చరిత్రతో పాటు ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని.. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ… ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో దశాబ్దాలపాటు పోరాడిందన్నారు. విద్యార్థులు, కార్మిక సంఘాలు, రైతులు, మహిళలు ఉద్యమానికి నాయకత్వం వహించారు.. వారి పోరాటం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గత పదేళ్లుగా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.. తమ ఆకాంక్షల సాధన కోసం ప్రజలు రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు.. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, రైతులు, మహిళలు, అణగారిన కులాల ఆకాంక్షలు నెరవేర్చడం మా కర్తవ్యం అని పేర్కొన్నారు.
భారతదేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను మేం ప్రారంభించాం. 15 ఆగస్టు 2024 న రూ.20,617 కోట్లు చెల్లించి 25లక్షల 50 వేల మంది రైతులను పూర్తిగా రుణ విముక్తులను చేశాం. స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణ రైతాంగానికి అప్పుల నుంచి విముక్తి లభించింది. భారతదేశంలోనే ఇది అతిపెద్ద రుణమాఫీ అన్నారు. మా రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతుభరోసా పేరుతో ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. భూమిలేని రైతుకూలీలకు ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.12,000 సాయం అందిస్తున్నాం. వ్యవసాయ రంగంలో భూమిలేని, భూమి కలిగిన రైతులకు కలిపి ఏటా రూ.20,000 కోట్లకు పైగా నిధులు ఇస్తున్నామన్నారు.
రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నాం. రైతుబీమా, పంటల బీమాలతో రైతులకు లబ్ధి చేకూరుస్తున్నాం..యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీని ప్రారంభించాం. మేం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయగలిగాం. 5 లక్షల మంది యువతకు ప్రయోజనం కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించుకున్నాం.. ప్రజోపయోగ విధానాలను రూపొందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి సారించారు. ఇందిరాగాంధీ రోటీ, కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారు. ఆ తర్వాత వచ్చినముగ్గురు కాంగ్రెస్ ప్రధానులు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్… వారు ఆధునికీకరణ, అభివృద్ధి, టెలికాం, సాఫ్ట్ వేర్ వంటి ప్రపంచ సాంకేతిక విప్లవాలపై దృష్టి సారించారు. వారి కృషి వల్లే భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలకు మా ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
దావోస్, అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ లలో జరిగిన పెట్టుబడుల సదస్సులకు మేం హాజరయ్యాం. ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూ.2.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. మా ప్రభుత్వానికి మహిళలు, రైతులు, యువతే ప్రధాన భాగస్వాములు అన్నారు. మా రాష్ట్రంలో అద్భుతమైన మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కొంత మంది మహిళలు కలిసి స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సభ్యులున్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చూడాలన్నదే మా లక్ష్యం అన్నారు. సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులకు మహిళలను యజమానులను చేశామన్నారు.
మన విద్యుత్ పంపిణీ సంస్థలు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు మహిళా సౌర విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కార్పొరేట్ రవాణా సంస్థలతో పోటీ పడుతూ మహిళలు 600 బస్సులను నడుపుతున్నారు. సోలార్ ప్లాంట్లు, ఈవీ బస్సులు నడపడంలో అదానీ, అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలతో మన మహిళా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి మహిళను ఇంటి యజమానిని చేయాలని సంకల్పించాం.
తొలి ఏడాదిలో 4,50,000 కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.22 వేల కోట్లు అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. మహిళలకు ఉచిత బస్సు పథకం కోసం 15 నెలల్లో రూ.5 వేల కోట్లు ఖర్చు చేశాం. 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం అందిస్తున్నాం.. మా ప్రభుత్వంలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ .10 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నాం. సీఎంఆర్ఎఫ్ ద్వారా పౌరుల ఆరోగ్య సంరక్షణ కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ఏడాదిలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,000 కోట్లు ఆర్థికసాయం అందించామని వివరించారు.
ట్ట్రాఫిక్ పోలీస్ విభాగంలో థర్డ్ జెండర్ ను రిక్రూట్ చేసుకున్న తొలి ప్రభుత్వం తెలంగాణ అని చెప్పడానికి సంతోషిస్తున్నా..మేం ఇప్పుడే పని మొదలు పెట్టాం…ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు.. ప్రజల జీవితాలను మార్చేందుకు మేం చేపట్టిన మిషన్ లో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నా.. మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలను మాతో పంచుకోండన్నారు. మీరే “తెలంగాణ రైజింగ్” బ్రాండ్ అంబాసిడర్లుగా మారి…తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటండని పిలుపునిచ్చారు.