రైతు భరోసాపై అనుమానాలు అవసరం లేదు : సీఎం రేవంత్‌

రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు.

By Medi Samrat  Published on  21 Dec 2024 8:15 AM GMT
రైతు భరోసాపై అనుమానాలు అవసరం లేదు : సీఎం రేవంత్‌

రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. పదేళ్లు బీఆర్ఎస్ రూలింగ్‌లో చేసిన అప్పులను బయట పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల రుణమాఫీ నుంచి వివిధ రంగాలకు పెండింగ్ పెట్టిన పనులన్నీ కలిపితే దాదాపు 7 కోట్ల లక్షల అప్పులు ఇచ్చారని పేర్కొన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతు భరోసాపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం రైతు బంధు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. సాగులో లేని భూములకు సైతం ఈ పథకాన్ని వర్తింప చేశారన్నారు.

పోడు భూములు, రైతులు, ఆదివాసీలకు ఇస్తూనే అందులో బీఆర్ఎస్‌కు చెందిన నాయకులు, నకిలీ పట్టాలు ద్వారా రైతు బంధు స్కీమ్‌ని అందజేశారన్నారు. మూడు కోట్ల ఎకరాలకు ప్రతీ ఏడాది 15 వేల కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. మొత్తం 72 వేల కోట్లు ఇచ్చారన్నారు. అందులో 22 వేల కోట్ల రూపాయలు జాతీయ రహదారుల భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మైనింగులు, క్రషర్లు, దొంగ పాస్ పుస్తకాల దారులు ఉన్నారన్నారు. నిజమైన లబ్దిదారులకు న్యాయం జరగాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు ముఖ్యమంత్రి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని వారికీ ఈ స్కీమ్‌ వర్తింప చేయాలా? అంటూ ప్రశ్నించారు. అద్భుతాలు చేసినందుకు ఇక్కడకు రాలేదన్నారు. రాళ్లు, రప్పలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినవారికీ, దొంగ పాస్ పుస్తకాలు ఉన్నవారికి ఇవ్వాలా? అన్నారు. సూచనలు ఇస్తే కచ్చితంగా తీసుకుంటామన్నారు. సభలో వాదనలకు తావు లేదన్నారు సీఎం. సభలో మీరు చేసే చిత్ర, విచిత్రాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాన ప్రతిపక్షం రాత పూర్వకంగా సూచనలు ఇస్తే తీసుకోవాలని స్పీకర్ వివరించారు.

కేంద్రం ఇచ్చిన డేటా ప్రకారం.. 2014-16 మధ్యకాలంలో ఏపీ- వెయ్యి లోపల రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ రెండో స్థానం (3,000 మంది)లో ఉందన్నారు. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉందన్నారు. ధనిక రాష్ట్రంలో ఇలా జరగడం దారుణమన్నారు. 2014‌లో బీఆర్ఎస్ హయాంలో రైతులకు 16,043 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. రెండోసారి రూలింగ్‌లో 11,909 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు. వడ్డీకి 8,515 కోట్ల రూపాయలు పోగా.. బీఆర్ఎస్ చేసింది కేవలం 3,384 కోట్ల రూపాయలు. మొత్తం 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశారు. పదేళ్లలో చేసింది కేవలం 27 వేల కోట్ల రూపాయలన్నమాట.

12 నెలల కాంగ్రెస్ రూలింగ్‌లో తొలి విడత లక్ష రూపాయల లోపు ఉన్నవారికి 11 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ చేశామన్నారు. సెకండ్ ఫేజ్- ఆరు వేల కోట్లు, మూడో విడత- 5 వేల కోట్లు రుణమాఫీ చేశామన్నారు. మూడు విడతలుగా 18 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ప్రజాప్రభుత్వానిదేనన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ విధంగా చేయలేదన్నారు. బ్యాంకుల వద్ద నుంచి వివరాలు తీసుకున్న తర్వాత రుణమాఫీ చేశామన్నారు. బీఆర్ఎస్‌కు ఇచ్చి పుచ్చుకోవడమే తెలుసని, వారు చేసిన పాపాలను తాను సభలో చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో 70 శాతం మంది వ్యవసాయం ఎవరూ చేయలేదన్నారు. రియల్ ప్లాట్లు విక్రయించి భూములు అమ్ముకుంటున్నారని గుర్తు చేశారు.

Next Story