కష్టం, కమిట్‌మెంట్‌తోనే నేను, విజయ్ దేవరకొండ ఈ స్థాయికి వచ్చాం : సీఎం రేవంత్
తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని.. నిజామ్‌లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇదని.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
By Medi Samrat
తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉందని.. నిజామ్‌లకు రాజా కార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరులు పుట్టిన గడ్డ ఇదని.. ఆ పోరాట స్ఫూర్తి నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్ర యువత డ్రగ్స్ మహమ్మారికి బలవడం న్యాయమా?' అని ఆయన ప్రశ్నించారు. మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాలపై ఆలోచన చేస్తే వెన్ను విరుస్తామని హెచ్చరించామన్నారు. ఉద్యమాల గడ్డ తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల్లో యువత డ్రగ్స్ మహమ్మారికి బలవుతుంటే చూస్తూ కూర్చుందామా.? అని ప్రశ్నించారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు కలిసికట్టుగా ముందుకు రావాలని.. పాఠశాలలు, కళాశాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలన్నారు. విద్యార్థుల వ్యవహార శైలిని గమనించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. మనందరం అప్రమత్తంగా ఉంటేనే మాదకద్రవ్యాలను నియంత్రించగలమని తెలిపారు. ఉద్యమాల గడ్డ తెలంగాణ గంజాయి, డ్రగ్స్‌కు వేదిక కావద్దని విజ్ఞప్తి చేశారు.
దేశ జనాభాలో 68 శాతం యువత ఉన్నారు.. ప్రపంచంలో 68 శాతం యువత ఉన్న ఏకైక దేశం భారతదేశం.. శత్రు దేశాలు మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నాయి. వాటిలో డ్రగ్స్ ఒకటని రేవంత్ రెడ్డి అన్నారు.
పంజాబ్‌లో గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారి యువత నిర్వీర్యమైంది. తెలంగాణలో యువత నిర్వీర్యం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏ పాలసీ లేని తెలంగాణలో మేం అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చాం. యువతలో నైపుణ్యం పెంచేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
నల్లమల నుంచి వచ్చిన నేను జెడ్పీటీసీ స్థాయి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను.. నాలాగే విజయ్ దేవరకొండ నల్లమల నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగారని తెలిపారు. కష్టం, కమిట్‌మెంట్ లేకుండా ఈ స్థాయికి వచ్చి రాణించలేరని పేర్కొన్నారు.
తెలంగాణ న్యాబ్‌ను ఇక నుంచి ఈగల్‌గా (EAGLE- ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈగల్ తెలంగాణలో ఎక్కడ గంజాయి పండించినా పసిగడుతుందని.. అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే పసిగడుతుందని వివరించారు. చదువు, స్పోర్ట్స్‌లో రాణించి హీరోలుగా నిలవాలని.. ఉద్యోగాల్లోనే కాదు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోనూ స్పోర్ట్స్ పర్సన్స్‌కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు.