హైదరాబాద్: హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్) వద్ద ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందిని కాపాడిన సాహసి శివను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాదరంగా అభినందించి, ఆ కుటుంబానికి భారీ అండగా నిలిచారు. శివ చేస్తున్న నిస్వార్థ సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ పోషణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని స్వయంగా అందజేశారు. దీనితో పాటు, శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోం గార్డు ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేయడం ద్వారా ఆ కుటుంబానికి శాశ్వత ఉపాధి భరోసా ఇచ్చారు.
అలాగే, నివాస సమస్యను పరిష్కరించేందుకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. శివ కోరిక మేరకు ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇచ్చే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఆపదలో ఉన్నవారికి ప్రాణదాతగా నిలిచిన శివను ప్రభుత్వం ఇంతటి సహృదయంతో ఆదుకోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు.