తెలంగాణ‌కు నీటి కేటాయింపుల విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి

తెలంగాణ‌కు అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు చేప‌ట్టాల‌నే విష‌యంపై కృష్ణా జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

By Medi Samrat  Published on  15 Jan 2025 7:39 PM IST
తెలంగాణ‌కు నీటి కేటాయింపుల విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి

తెలంగాణ‌కు అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు చేప‌ట్టాల‌నే విష‌యంపై కృష్ణా జ‌ల వివాదాల ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం (ఏపీఆర్ఏ)-2014లోని సెక్ష‌న్ 89 ప్ర‌కారం.. ప్రాజెక్టుల‌వారీగా నీటి కేటాయింపులు చేప‌ట్టాల్సి ఉంటుంద‌న్నారు. ఏపీఆర్ఏ ప్ర‌కారం ఏర్పాటైన అపెక్స్ కౌనిల్ సైతం సెక్ష‌న్ 3 ఆధారంగా నీటి పంప‌కాలు రెండు రాష్ట్రాల మ‌ధ్య చేప‌ట్టాల‌ని సూచించింద‌ని సీఎం తెలిపారు. కేడ‌బ్ల్యూడీటీ-II త‌దుప‌రి విధివిధానాలపై (ఫ‌ర్‌ద‌ర్ ట‌ర్మ్స్ ఆఫ్ రిఫ‌రెన్స్‌) ఏపీ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించినా అత్యున్న‌త న్యాయ‌స్థానం ఎటువంటి స్టే ఇవ్వ‌ని విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు.

రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో బుధ‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మంత్రులు శ్రీ‌ధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వి.శేషాద్రి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (నీటి పారుద‌ల శాఖ‌) ఆదిత్య‌నాధ్ దాస్, నీటి పారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జా త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఎటువంటి అనుమ‌తులు లేకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల అనుసంధాన ప్రాజెక్టు చేప్ట‌ట‌డంపై కేంద్ర జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌, ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు గోదావ‌రి, కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డుల‌కు (జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ) తెలంగాణ త‌ర‌ఫున అభ్యంత‌రాలు తెలుపుతూ లేఖ‌లు రాయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఏ న‌దిపైనైనా ప్రాజెక్టు నిర్మించాలంటే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల‌తో పాటు పొరుగు రాష్ట్రానికి స‌మాచారం ఇవ్వాల‌నే విష‌యాన్ని లేఖ‌ల్లో ప్ర‌స్తావించాల‌ని సీఎం సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టుతో భద్రాచ‌లం ముంపు విష‌యంపై హైద‌రాబాద్ ఐఐటీతో అధ్య‌య‌నం చేయించే అంశాన్ని నిర్దేశిత స‌మ‌యంలో పూర్తి చేయించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. స‌మ్మ‌క్క సార‌క్క బ్యారేజీ, పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు అనుమ‌తులు సాధించే ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సీఎం సూచించారు.

Next Story