నిరుపేదలకు అన్యాయం చేయం.. వారందరికీ ఇళ్లు ఇస్తాం: సీఎం రేవంత్
వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునేలా హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ..
By - అంజి |
నిరుపేదలకు అన్యాయం చేయం.. వారందరికీ ఇళ్లు ఇస్తాం: సీఎం రేవంత్
వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులు, భవిష్యత్తు విపత్తులను తట్టుకునేలా హైదరాబాద్ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన మూసీ నది పునరుజ్జీవం కోసం నగర వాసులందరూ సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కబ్జాల నుంచి రక్షించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన అంబర్ పేట బతుకమ్మకుంటను బతుకమ్మ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. బతుకమ్మకుంట నీటిలో ముఖ్యమంత్రి బతుకమ్మను వదిలి గంగమ్మ తల్లికి హారతి ఇచ్చి పూజలు చేశారు.
ఈ వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, స్థానికులు అందరూ సహకరిస్తేనే వంద రోజుల్లో బతుకమ్మ కుంట పునరుద్దరణ కల నిజమైంది. మీరంతా సహకరిస్తేనే ఒక నాయకుడిగా నేను ముందుకు వెళ్లగలను. బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చిన నిరుపేదలు మూసీ ఒడ్డున గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. నిరుపేదలకు ఈ ప్రభుత్వం అన్యాయం చేయదు. చేయబోం. అందరినీ ఆదుకుంటాం. ఎవరెవరు నివాసం కోల్పోతున్నారో వారందరికీ ప్రభుత్వం శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలబడుతుంది. మంచి పని చేయాలని, మంచి సంకల్పంతో ముందుకు వెళుతున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు తప్పవు. కోవిడ్ తర్వాత పర్యావరణంలో ఊహించని రీతిలో మార్పులొచ్చాయి.
హైదరాబాద్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు రోజుకు 2 సెం.మీ వర్షం కురిస్తే తట్టుకునే విధంగా నిర్మాణమయ్యాయి. ఆ మేరకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. కానీ పర్యావరణంలో వస్తున్న మార్పులు, విపరీతంగా పెరిగిన కాలుష్యం కారణంగా గంట రెండు గంటల్లోనే 40 సెం.మీ వర్షం వచ్చే ప్రమాదకరమై పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇలాంటి పరిస్థితులపై ముందుగానే ఆలోచన చేశాం. శాస్త్రవేత్తలతో మాట్లాడాం. వాతావరణంలో వస్తున్న మార్పులు, రాబోయే ప్రమాదాలపై నిపుణులతో ఆలోచనలు చేసి హైడ్రాను ప్రారంభించాం. హైడ్రాను ప్రారంభించినప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. కొంతమందికి అర్థం కాలేదు. మరికొందరు తమ కబ్జాలు ఇక సాగవని రకరకాల ఎత్తుగడలు వేశారు. నదులు, నాలాలు, చెరువులను చెరబడితే తాట తీయాలని నిర్ణయం తీసుకున్నాం.
మూసీ నదిని పునరుద్దరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. స్థానిక శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ ముందుకొచ్చి సహకరించారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలు అవసరం లేదు. హైదరాబాద్ నగరానికి చెందిన మిగతా నియోజకవర్గ శాసనసభ్యులు కూడా అభివృద్ధిలో కలిసి రావాలి. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలో మూసీ 5 కి.మీ మేరకు విస్తరించిన మూసీ పరివాహక ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల విషయంలో మంత్రి, కలెక్టర్ ఎన్యుమరేషన్ చేస్తే వారికి అవసరమైన పునరావాసం కల్పిస్తాం. బతుకమ్మకుంటను కాపాడాలని ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్న సీనియర్ నాయకుడు వీ. హనుమంత రావు పేరును బతుకమ్మకుంటకు నామకరణం చేయడానికి అధికారులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. సరైన ప్రతిపాదనలు రూపొందిస్తే నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కలిపి ఒకచోట మినీ సెక్రటేరియట్ ను నిర్మిస్తాం. వచ్చే డిసెంబర్ 9 తేదీ లో అందుకు అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా నిధులు కూడా మంజూరు చేస్తాం'' అని చెప్పారు.