తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్, రాబోయే ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై చర్చించారు.
2023 డిసెంబర్ నుంచి 'ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం' అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, మహిళలు, రైతులు, యువత సాధికారత కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి వారికి వివరించారు. పాలనా సంస్కరణలు, సామాజిక న్యాయం, క్షేత్రస్థాయిలో పార్టీకి పెరుగుతున్న ప్రజాధరణపై అధిష్టానానికి నివేదించారు. జాతీయ నాయకత్వం అందించిన సూచనలు, స్ఫూర్తితో తెలంగాణలో సమగ్ర మరియు సమ్మిళిత అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు.