గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..

By Medi Samrat  Published on  1 July 2024 4:15 PM IST
గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. గవర్నర్‌తో రేవంత్‌రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రేవంత్ రెడ్డి ఇటీవల న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ నేతలను కలిశారు.

తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. మీడియా ప్రతినిధులతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కేబినెట్ బెర్త్ ఖాళీ లేదని, మంత్రులందరూ సమర్థవంతంగా పనిచేస్తున్నారని అన్నారు.

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో వాటిపై చర్చించేందుకు సీఎం గవర్నర్‌ను కలిశార‌ని మ‌రో టాక్ న‌డుస్తుంది. గవర్నర్‌తో భేటీలో గ‌వ‌ర్న‌ర్‌ కోటాలో పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలతో పాటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఆయన చర్చించినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రభుత్వ ఆస్తుల పంపిణీ విష‌య‌మై కూడా సీఎం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశార‌నేది కారణం. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇంతకుముందు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) వరుస సమావేశాలు నిర్వహించినప్పటికీ.. సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఈ విష‌య‌మై గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం చ‌ర్చించిన‌ట్లు కూడా ఊహాగానాలు వ‌స్తున్నాయి.

Next Story