సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు : సీఎం రేవంత్
దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి.. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
By Medi Samrat Published on 21 Sep 2024 9:00 AM GMTదేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్ఫూర్తిని రగిలించి.. పేదల పక్షాన గళం విప్పిన సీతారాం ఏచూరి మరణం తీరని లోటు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామిక వేదికలపై మన కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. వారిని కలిసి మాట్లాడినప్పుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గుర్తొచ్చేవారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి సమకాలికుడుగా సీతారాం ఏచూరి ఉండేవారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసమే చివరి శ్వాస వరకు నిలబడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కీర్తించారు.
ఆయన బ్రతికి ఉన్నంత కాలం పేదల కోసం పోరాడారు.. మరణాంతరం కూడా ఉపయోగపడాలన్న కుటుంబసభ్యుల నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. యూపీఏ హయాంలో పేదలకు ఉపయోగపడే కీలక బిల్లులకు మద్దతు తెలపడంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారన్నారు.
రాహుల్ గాంధీ ఆయన్ను మార్గానిర్దేశకుడిగా భావిస్తారని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశంలో ఆధిపత్యం చేలాయించాలన్న కుట్ర జరుగుతోంది.. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబాలించాలనుకుంటున్న ఇలాంటి కీలక సమయంలో ఆయన లేకపోవడం దేశ రాజకీయాల్లో తీరని లోటు అన్నారు. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన ఇలాంటి సందర్భంలో ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. మనకు దిక్సూచీలా ఉండాల్సిన సమయంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం అన్నారు.
సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు చాలా అరుదు.. విద్యార్థి దశ నుంచి దేశ క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన స్పూర్తితో జమిలి ఎన్నికల వ్యతిరేక పోరాటంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి మాట్లాడితే.. ప్రధాని స్పందించకపోవడం వారి ఫాసిస్టు విధానాలకు నిదర్శనం అన్నారు. అలాంటి భాషా ప్రయోగం చేసిన వారిని నియంత్రించకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.