అరుదైన ఘనత సాధించబోతున్న సీఎం రేవంత్‌రెడ్డి..దేశంలోనే తొలి సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు.
By - Knakam Karthik |
అరుదైన ఘనత సాధించబోతున్న సీఎం రేవంత్‌రెడ్డి..దేశంలోనే తొలి సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అరుదైన ఘనత సాధించబోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్స్ పూర్తి చేసి ఐవీ లీగ్ యూనివర్సిటీ తరగతుల్లో శిక్షణ పొందుతున్న తొలి భారతీయ సీఎంగా రేవంత్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించనున్నారు.
కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో “Leadership for the 21st Century: Chaos, Conflict & Courage” ప్రతిష్ఠాత్మక కోర్స్‌కు హాజరుకానున్నారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు అమెరికాలోని మాసాచుసెట్స్ రాష్ట్రం కేంబ్రిడ్జ్‌లో ఉన్న కెనడీ స్కూల్ క్యాంపస్‌లో తరగతులకు హాజరుకానున్నారు. ఐదు ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్‌మెంట్‌లు, గ్రూప్ ప్రాజెక్టులు పూర్తి చేయనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పాలన, సంక్షోభ నిర్వహణ, నాయకత్వంపై వివిధ దేశాల కేస్ స్టడీలను విశ్లేషించి పరిష్కారాలను తరగతిలో సమర్పించనున్నారు. ఈ కోర్స్‌కు ప్రొఫెసర్ టిమ్ ఓ’బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కోర్స్ పూర్తి చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి అధికారిక సర్టిఫికెట్ ఇవ్వనుంది. దేశంలో ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రుల్లో హార్వర్డ్ నుంచి కోర్స్ సర్టిఫికెట్ పొందనున్న మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించనున్నారు.