దేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని బుద్ధ భవన్ వద్ద ఏర్పాటు చేసిన హైడ్రా తొలి పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీంతో పాటు హైడ్రా డిజాస్టర్ టీమ్ కొత్త వాహనాలను కూడా సీఎం ప్రారంభించారు.
కాగా భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్టేషన్‌కు ఏసీపీ తిరుమల్ ఎస్‌హెచ్‌వోగా వ్యవహరించనున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు. హైడ్రాకు 70 వాహనాలను ప్రభుత్వం అందజేసింది. ఇందులో ట్రక్కులు-21, స్కార్పియోలు-55, ఇన్నోవాలు-4 ఉన్నాయి.
భూకబ్జాలు, ప్రభుత్వ భూములు, చెరువుల ఆక్రమణల వంటి సమస్యలకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం.. ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించింది. అదే హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ). ఇక రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన హైడ్రాకు చట్టబద్దత లేదన్న విమర్శలు రావడంతో.. ఏకంగా చట్టాన్ని సవరించి మరీ హైడ్రాకు చట్టబద్ధతను కల్పించారు. అంతేకాక హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక హైడ్రా పరిధిని మరింత విస్తరిస్తూ.. ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని ఏర్పాటు చేసింది.