మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.? : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు

By Medi Samrat  Published on  25 Oct 2024 9:30 AM GMT
మూసీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.? : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ వేదికగా జరిగిన ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. జ్వోతి ప్రజ్వలన చేసిన అనంతరం ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. దేశ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, ఆవశ్యకతను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అదే సమయంలో కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింది, కానీ ఎన్డీయే హయాంలో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు..

ముఖ్యమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

కాంగ్రెస్ హయాంలో దేశంలో అభివృద్ధి కోసం భాక్రానంగల్ నుంచి, నాగార్జున సాగర్ వరకు ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.

ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావో తో ఎన్నో మార్పులు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకురావడంతో పాటు టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చారు.

మహాత్మగాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత కాంగ్రెస్దే. పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్పవ్యక్తి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన తెలుగు ఠీవీ..మన పీవీ నరసింహారావు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ నేతలందరూ ప్రజలందరి మౌలిక అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేశారు. తరువాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ సేవలు అందించింది. కాంగ్రెస్, యూపీఏ హయాంలో ఎన్నో విప్లమాత్మక మార్పులు వచ్చాయి.

నెహు నుంచి మొదలుకుంటే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ ప్రధానులు ఈ దేశంలో అనేక సంస్కరణలు, విప్లవాలు తీసుకువచ్చారు. మరి మూడో సారి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఈ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకువచ్చారు..? ఈయన హయాంలో దేశానికి ఏం సేవలు చేశారు..? ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పండి. నేను సవాల్ విసురుతున్నా. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారు. కానీ ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదు. రైతులను పట్టించుకోవటం లేదు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటీ..? ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారత దేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

గతంలో నార్త్ ఇండియా నుంచి ప్రధాని అయితే, సౌత్ ఇండియా నుంచి రాష్ట్రపతిని చేసే సంప్రదాయాన్ని కాంగ్రెస్ పాటించింది. కానీ ప్రధాని మోదీ హయాంలో ఇలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. అందుకే దక్షిణాది నుంచి నీలం సంజీవరెడ్డి, అబ్దుల్ కలాం లాంటి వాళ్లు రాష్ట్రపతి అయ్యారు. కానీ ఎన్డీయే హయాంలో కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ప్రధాని మోదీ పార్టీ ప్రయత్నాలు చేసింది కానీ దక్షిణాదికి చేసిందేమీ లేదు. దక్షిణాదికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది, కానీ ఇప్పుడు ఎన్డీయే మాత్రం దక్షిణాది నుంచి పెద్ద ఎత్తున పన్నులు తీసుకుంటోంది. కానీ తిరిగి ఇచ్చింది ఏమీ లేదు.

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. సౌత్ స్టేట్స్ కు ప్రధాని మోడీ అందించిన సహకారం చాలా తక్కువ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం పెద్దగా నిధులు ఇవ్వకపోయినా ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతారు. నార్త్ స్టేట్స్ తో పోలిస్తే సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా వాటిలో తిరిగి పొందేది మాత్రం చాలా తక్కువ. కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే కేవలం రూ.40 పైసలు మాత్రమే తిరిగి వెనక్కి వస్తున్నాయి. అదే యూపీ నుంచి పన్నుల ద్వారా కేంద్రానికి రూపాయి వెళ్తే రూ.7, బిహార్ కు రూ.6 వెనక్కి వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా నిధుల విషయంలో మాత్రం వివక్ష జరుగుతూనే ఉంది. ప్రధాని మోడీ ఉత్తర భారత దేశానికి చెందిన వ్యక్తి కావటమే ఈ ప్రాంతాన్ని పట్టించుకోకపోవడానికి కారణం.

‘‘అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్ ను అభివృద్ధి చేస్తాం. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా బాపూ ఘాట్ అభివృద్ధి చేయబోతున్నాం. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా... బాపూ ఘాట్ లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది. గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం. దీన్ని బీఆరెస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? .. మీరు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు కానీ మేము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే మీ బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు..? ఎందుకంటే మేము గుజరాత్ కు పోటీ ఇవ్వబోతున్నామని అందువల్లే తెలంగాణను, హైదరాబాద్ ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు మా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారు.

ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రాడార్, ఇరిగేషన్ ప్రాజెక్టులతో తెలంగాణ పురోగతి సాధించి గుజరాత్ కు పోటీ ఇస్తుందనే విషయం తెలిసే మా ప్రయత్నాలను ఆపేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేకించిన మరుసటి రోజే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడతారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తే సమస్య ఏంటీ..?

పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత సీఎం కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్ కు రాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు. కేసీఆర్ కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదు. కేసీఆర్ ఆయనే ఫ్రీడం ఫైటర్ అని చెప్పుకుంటాడు. నాకేమీ అభ్యంతరం లేదు. తన ఫాంహౌస్‌లో పడుకొంటాడు. పదేళ్లలో ఒక్కసారి సచివాలయానికి రాలేదు. గత పది నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. మీకు డెమొక్రసీపై గౌరవం ఉంటే ఎందుకు రావట్లేదు. తానో జమిందార్, ప్రజలందరూ గులాంలని కేసీఆర్ అనుకుంటాడు. అందుకే బయటరు రావడం లేదు. తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకుంటేనే మేము అధికారంలోకి వచ్చాం. మీకు నచ్చకుంటే ఇంట్లో కూర్చోండి. మా ప్రభుత్వాన్ని పని చేయనివ్వండి. మా ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తే ప్రజలు అంతా గమనిస్తున్నారు. పార్లమెట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేసీఆర్ ప్రజల ఆలోచనను అర్థం చేసుకోవాలి. ప్రజల ఆలోచనను పట్టించుకోకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సర్కార్ ను పడగొట్టాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే నాకు మద్దతుగా నిలిచారు.

Next Story