ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తికి డెడ్‌లైన్ విధించిన సీఎం రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు.
By అంజి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తికి డెడ్‌లైన్ విధించిన సీఎం రేవంత్
ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణ వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. ఇకనుంచి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా పనులు జరగాలని చెప్పారు. 2027డిసెంబరు 9 లోగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి 2027 డిసెంబర్ 9 న తెలంగాణ ప్రజలకు అంకితమివ్వాలని ముఖ్యమంత్రి గడువు నిర్దేశించారు. గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ఫ్లోరోసిస్ పీడిత నల్గొండ జిల్లాకే కాకుండా తెలంగాణకు అత్యంత కీలకమని, ప్రపంచస్థాయి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పకడ్బందీగా పటిష్టవంతమైన రక్షణ చర్యలతో ముందుకు సాగాలని చెప్పారు.
ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణపై ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్, నీటి పారుదల శాఖ సలహాదారులు ఆదిత్యనాథ్ దాస్, లెఫ్ట్ నెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సొరంగం పనుల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. సర్వేతో పాటు పనులు పూర్తి అయ్యేంత వరకు ఆయా రంగాల్లో నిష్ణాతులైన అన్ని ఏజెన్సీల సలహాలు, వారి భాగస్వామ్యంతో యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగించాలని అదేశించారు.
భవిష్యత్ లో దేశ విదేశాల్లో చేపట్టే టన్నెల్ ప్రాజెక్ట్ లకు ఆదర్శంగా ఉండేలా ఎస్ఎల్‌బీసీ నిర్మాణం ఒక కేస్ స్టడీగా నిలవాలని ఆకాంక్షించారు. అటవీ శాఖ, ఇంధన శాఖ ఇరిగేషన్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. ఈ నెల 15 వ తేదీలోగా కేబినేట్ సమావేశమై ఎస్ఎల్‌బీసీ పునరుద్దరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకోవాలని నిర్ధేశించారు.
టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించి ఉన్న సమస్యను ఒక్క సమావేశంలోనే పరిష్కారం రావాలని, అటవీ, విద్యుత్ సరఫరా, సొరంగం తవ్వకంలో సింగరేణి నుంచి నిపుణుల సేవల వంటి అన్ని అంశాలు కొలిక్కి రావాలని చెప్పారు. గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్న ఈ టన్నెల్ ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.
సొరంగం పనులను వేగంగా పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థ జేపి అసోసియేట్స్ అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని, ఇకనుంచి ఒక్క రోజు కూడా పనులు ఆలస్యం చేసినా ఒప్పుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పనులు ఆగకుండా ఇన్‌లెట్, అవుట్‌లెట్ రెండు వైపుల నుంచి పనులు చేపట్టాలని సూచించారు.
ఎస్‌ఎల్‌బీసీ పనులకు గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగ మార్గానికి గాను ఇప్పటికే 35 కి.మీ సొరంగం తవ్వడం పూర్తయిందని, మిగిలిన 9 కి.మీ. సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్టు ఈ సందర్భంగా పరీక్షిత్ మోహ్ర వివరించారు ప్రతి నెల 178 మీ. సొరంగం తవ్వే లక్ష్యంగా ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్‌జీఆర్‌ఐ ద్వారా ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.