మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే.. వాళ్లు రెండు ఇచ్చారు : సీఎం రేవంత్
మంచిర్యాల ప్రాంత ప్రజలు అదృష్టవంతులని.. మీరు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవకులుగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ లభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 24 Feb 2025 5:31 PM IST
మంచిర్యాల ప్రాంత ప్రజలు అదృష్టవంతులని.. మీరు ఒక్క ఓటు వేస్తే ఇద్దరు సేవకులుగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ లభించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు పోటీపడుతున్నారు.. ప్రధాన ప్రతిపక్షం BRS అభ్యర్థులను నిలబెట్టలేదు.. BRS నాయకులు హరీష్ రావు, కేటీఆర్, కవిత కాంగ్రెస్‌ను ఓడించమంటున్నారు.. ఎవరికీ ఓటు వేయమని BRS నాయకులు కోరుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఎంఎల్సీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారో తెలపాలన్నారు.
లోకసభ ఎన్నికల్లో BRS 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోతే.. 8 చోట్ల బీజేపీ గెలిచింది.. ఇందులో ఉన్న మతలబు ఏమిటి అని ప్రశ్నించారు. బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణకు ఏం సాధించింది.. తెలంగాణ నుంచి బీజేపీకి ఎంపీలు కావాలి.. మా ఓట్లతో కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కావాలి కానీ తెలంగాణకు మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లను చేపడితే ఆదిలాబాద్ సస్యశ్యామలం అయ్యేది.. మహారాష్ట్ర అనుమతులు ఇవ్వలేదన్నారు.. అనుమతులు బీజేపీ ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. మేము ఉపాధ్యాయ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలు 55 వేలు ఇచ్చాం.. మేము ఉద్యోగాలు ఇవ్వడం నిజం కాకపోతే మీరు మాకు ఓటు వేయవద్దు.. మేము 55 వేల ఉద్యోగాలు ఇస్తే.. నరేంద్ర మోదీ తెలంగాణకు 2 ఉద్యోగాలు ఇచ్చారు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు మాత్రమే 2 ఉద్యోగాలు నరేంద్ర మోదీ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
నైపుణ్యాల పెంపునకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాం.. రాబోయే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ సాధనే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చైనా దేశం, దక్షిణ కొరియాలోని ఒక్క యూనివర్సిటీ నుంచి పాల్గొన్న ఒక్క మహిళ 3 గోల్డ్ మోడల్స్ సాధిస్తే 100 కోట్ల పైన జనాభా ఉన్న మనదేశం ఎన్ని గెలిచింది అని ప్రశ్నించారు. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాల సాధనకు దావోస్ సదస్సులో పాల్గొని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం.. ఈ రోజు కూడా ఒక సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించి వచ్చానని వెల్లడించారు.
మా ప్రభుత్వం 25 లక్షల కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల రుణ మాఫీ చేసింది.. రుణమాఫీ అయిన కుటుంబాల వారు నరేంద్ర రెడ్డికి ఓటు వేయాలని కోరారు. 3 ఎకరాల వరకు రైతు భరోసా వేశాం.. మార్చి 31 వరకు రైతు భరోసా పూర్తి చేస్తాం.. అక్కాచెల్లెళ్లు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.. రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 200 లోపు యూనిట్ల విద్యుత్ ఇళ్లకు ఉచితంగా వచ్చే వారు నరేందర్ రెడ్డి కి ఓటు వేయండని అభ్యర్ధించారు.