హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి న్యాయం, సమానత్వం, గౌరవం కల్పించిందని గుర్తుచేస్తూ, ప్రజాస్వామిక, గణతంత్ర, లౌకిక, సామ్యవాద, సార్వభౌమ దేశంగా భారతదేశం ప్రగతి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షించారు. అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశ ప్రజలందరికీ గొప్ప పండుగ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడం, సమ్మిళిత అభివృద్ధిని వేగవంతం చేయడం, జాతీయోద్యమ నాయకులు, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ, ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతకు, గణతంత్రాన్ని తీర్చిదిద్దిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు నివాళులర్పిస్తూ, యోధుల ఆకాంక్షలకు అనుగుణంగా దేశ సేవకు పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.