జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్‌ చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పోలీసు రిక్రూట్‌మెంట్‌పై హైపవర్ కమిటీతో సమావేశమయ్యారు. జీవో 46ను రద్దు చేసే అవకాశాలను పరిశీలించారు.

By అంజి  Published on  13 Feb 2024 3:00 AM GMT
CM Revanth Reddy, Govt authorities, GO No 46, Telangana

జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం రేవంత్‌ చర్చ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పోలీసు రిక్రూట్‌మెంట్‌పై హైపవర్ కమిటీతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పోలీసు రిక్రూట్‌మెంట్‌లో స్థానికతకు సంబంధించిన జీవో 46ను రద్దు చేసే అవకాశాలను పరిశీలించారు. త్వరలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గత ప్రభుత్వం మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అక్టోబరు 4, 2023 నాటికి 15,750 పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసు కారణంగా నియామక ప్రక్రియ పెండింగ్‌లో పడింది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల హైకోర్టు తీర్పు చెప్పింది.

తాజాగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియపై అడ్వకేట్ జనరల్ సలహాలు, సూచనలను సీఎం రేవంత్ కోరారు. పాత జిఓ 46 ప్రకారం 15,750 పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు ఇవ్వడం తప్ప మరో మార్గం లేదని అడ్వకేట్ జనరల్, సీనియర్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. అయితే, కొత్త నోటిఫికేషన్‌ల కోసం జిఓ 46 రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. ఈ విషయమై అసెంబ్లీలో చర్చించి, కేబినెట్‌ సబ్‌ కమిటీ ద్వారా జీవో 46 రద్దుపై నిర్ణయం తీసుకుందామని చివరిగా ముఖ్యమంత్రి అధికారులతో చెప్పినట్టు తెలిసింది. సమావేశంలో మంత్రి డి శ్రీధర్‌బాబు, అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రంజినీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ శివధర్‌రెడ్డి, టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ చైర్మన్‌ శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Next Story