ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం పని చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. భేటీపై భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, విభజన చట్టంశాలపై ప్రధానమంత్రిని, అమిత్ షాను కలిశామని తెలిపారు.
ఈ భేటీలో వేలం లేకుండా సింగరేణికి బొగ్గు పనులు కేటాయించాలని కోరామని.. తెలంగాణ రాష్ట్రానికి ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించి కేటాయింపులు చేయాలని.. సెమీ కండక్టర్స్ యూనిట్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు.
ప్రతి జిల్లాకు నవోదయ స్కూల్, కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. విద్యుత్తు రంగంలో తెలంగాణకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఎక్స్చేంజి కింద డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని.. రీజినల్ రింగ్ రోడ్డుకు మొత్తంగా ఒకే జాతీయ రహదారి నెంబర్ ఇవ్వాలని.. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినట్లు వెల్లడించారు. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు కేంద్రం సహకారం ఇవ్వాలన్నారు. ఐపీఎస్ క్యాడర్ కింద 29 మందిని అదనంగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.