నాతో పాటు ఎవరికైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే.. అది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికే
భువనగిరి గడ్డ పోరాటాలకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భువనగిరి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ..
By Medi Samrat Published on 22 April 2024 3:02 AM GMTభువనగిరి గడ్డ పోరాటాలకు స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భువనగిరి కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ.. కష్ట నష్టాల్లో పేదలకు సేవలందించిన మీ బిడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మంత్రి పదవి తీసుకుంటానని చెప్పి నల్లగొండ పోరాట యోధుడు వెంకట్ రెడ్డి అని కొనియాడారు. భూమికి మూరెడు లేని సన్నాసి.. మంత్రి పదవికోసం కాకాపడుతున్నారని ఇవాళ రాజగోపాల్ రెడ్డిని విమర్శిస్తున్నాడని ఓ మాజీమంత్రిపై ఫైరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ దొరగారి దొడ్లో దొరకు సారాలో సోడాపోసి రాజకీయాలలోకి రాలేదు.. రక్తాన్ని చెమటగా మార్చి.. భుజాలు కాయలు కాసేలా మూడు రంగుల జెండాను మోసి రాజకీయాల్లో పైకి వచ్చారన్నారు. నాతో పాటు ఎవరికైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే.. అది కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికే ఉందన్నారు. అధిష్టానం ఆదేశాల ప్రకారం నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టానన్నారు. ముఖ్యమంత్రి పదవిని నేను ఎప్పుడూ బాధ్యతతో చూసానే తప్ప.. అహంకారంతో చూడలేదన్నారు. ముఖ్యమంత్రి కాకముందు కలిసినట్టే.. ఇప్పుడూ ప్రజల్ని కలిస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నామన్నారు.
కమ్యూనిస్టు సోదరులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. మనమంతా కలిసి బీఆర్ఎస్, బీజేపీలను బొంద పెట్టాలన్నారు. కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్ అంటుండు.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడు కేసీఆర్.. పోటీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగుల ఉసురు తీసుకున్న వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసాం.. 30 వేల ఉద్యోగాల వివరాలు ఇస్తాం.. దమ్ముంటే భువనగిరి సెంటర్ లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు కాంగ్రెస్ ను ఓడించాలా? రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించినందుకు కాంగ్రెస్ ను ఓడించాలా? 40 లక్షల కుటుంబాలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నందుకు కాంగ్రెస్ ను ఓడించాలా..? అని ప్రశ్నించారు.
పదేళ్లలో ఒక్కరికి కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు కాంగ్రెస్ ను ఓడించాలా? అని ప్రశ్నించారు. వంద రోజుల్లో పేదల సంక్షేమానికి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళుతుంటే.. పదే పదే ప్రభుత్వం పడిపోతదని కేసీఆర్ అంటుండు.. ఇదేమైనా ఫుల్ బాటిలా పడిపోవడానికి.. ప్రభుత్వం పడిపోతదని ఎవరైనా మాట్లాడితే ఉరికించి కొడతామని హెచ్చరించారు.
రాష్ట్ర అవతరణను తప్పు పట్టిన బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. భువనగిరిలో క్యామను ముందు పెట్టి వెనక బూర ఊదుతుండు కేసీఆర్.. గొల్ల కురుమలను కేసీఆర్ మోసం చేస్తుండు.. వెనక గూడుపుఠాని నడుపుతుండ్రని అన్నారు.
రాజగోపాల్, వెంకట్ రెడ్డి భువనగిరికి డబుల్ ఇంజన్.. చామల కిరణ్ ను 3లక్షల మెజారిటీతో గెలిపించండని పిలుపునిచ్చారు. మూసీని ప్రక్షాళన చేసి మూసీ మురికి నుంచి విముక్తి చేసే బాధ్యత నాది.. గంధమల్ల, బ్రాహ్మణ వెల్లం, ఎస్ఎల్బీసీ పూర్తి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. నల్లగొండ ఫ్లోరైడ్ పాపం ఎవరిది.. మీది కాదా? ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా జాప్యం చేసి తాగునీరు అందకుండా చేసింది మీరు కాదా? అని ప్రశ్నించారు. చామల కిరణ్ ను గెలిపిస్తే భువనగిరిని ట్రిపుల్ ఇంజన్ లా అభివృద్ధి చేస్తారు. చామల కిరణ్ ను గెలిపించండి.. యదాద్రిని మళ్లీ యాదగిరిగుట్టగా మార్చుకుందామన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా మాట ఇస్తున్నా.. పంద్రాగస్టు లోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాది.. వచ్చే పంటకు రూ.500 బోనస్ అందించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.