తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి వేయొద్దని తాము అదానీకి లేఖ రాశామని, అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. విమర్శల దృష్ట్యా అదానీ విరాళం తిరస్కరించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు లేఖ రాసినట్లు చెప్పారు.
అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు సేకరించిందని ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదన్నారు రేవంత్ రెడ్డి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు తమ ప్రభుత్వం టెండర్లను పిలిచి ప్రాజెక్టులు ఇస్తోందని తెలిపారు. అంబానీ, అదానీ, టాటా ఇలా ఎవరికైనా తెలంగాణలోనూ వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు.