పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.
By - Knakam Karthik |
పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవ్వాల్సిందే..సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పోలీస్ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న పోలీసుల కృషిని అభినందించిన సీఎం, సమస్యల లోతును అర్థం చేసుకుని పరిష్కరించుకోవడానికే ఈ రిట్రీట్ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ముఖ్యంగా సవాళ్లు టెక్నికల్ మరియు అడాప్టివ్ అని రెండు రకాలుగా ఉంటాయని, టెక్నికల్ సమస్యలను వనరులతో అధిగమించవచ్చని, కానీ అడాప్టివ్ సవాళ్లను ఎదుర్కోవాలంటే క్షేత్రస్థాయి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని, పాలసీ పెరాలసిస్ లేకుండా 'తెలంగాణ రైజింగ్ 2047' డాక్యుమెంట్ ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీలో కాలుష్యం, బెంగళూరులో ట్రాఫిక్, ముంబైలో వరదల వంటి సమస్యల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు.
నేరాల స్వరూపం మారుతోందని, ఒకప్పుడు తీవ్రవాదం ప్రధాన సమస్యగా ఉంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ మరియు నార్కోటిక్స్ పెద్ద సవాళ్లుగా మారాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తీవ్రవాదం కోసం గ్రేహౌండ్స్, ఆక్టోపస్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లే, ఇప్పుడు సైబర్ నేరాలను అరికట్టడానికి వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసుకోవాలని, సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాలని సూచించారు. సిబ్బంది రేషనలైజేషన్ చేపట్టి జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా చూడాలన్నారు.
పోలీస్ శాఖలో 'ఆటో మోడ్' లేదా 'ఆటో ప్రమోషన్లు' ఉండకూడదని, కేవలం పనితీరు ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని స్పష్టం చేశారు. రిట్రీట్‌లో అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, అవి చట్టరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖ అడిగిన నిధులను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి ఏటా డిసెంబర్‌లో బడ్జెట్‌కు ముందే ఈ రిట్రీట్ నిర్వహించుకుంటే నిధుల కేటాయింపు సులభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.